బీజేపీ సర్కార్ జేబు సంస్థగా ఎలక్షన్‌ ‌కమిషన్‌ ..అడ్డదారిలో గెలిచేందుకు బీజేపీ కుట్ర : టీపీసీసీ చీఫ్‌‌ మహేశ్‌గౌడ్‌‌

బీజేపీ సర్కార్ జేబు సంస్థగా ఎలక్షన్‌ ‌కమిషన్‌ ..అడ్డదారిలో గెలిచేందుకు బీజేపీ కుట్ర : టీపీసీసీ చీఫ్‌‌ మహేశ్‌గౌడ్‌‌

నిజామాబాద్‌, వెలుగు : ప్రతిపక్ష లీడర్లే టార్గెట్ గా కేంద్రం సీబీఐ, ఈడీ సంస్థలను ఉసిగొల్పుతోందని టీపీసీసీ చీఫ్‌‌ మహేశ్​కుమార్‌‌ గౌడ్‌‌ ఆరోపించారు. ఈ రెండు సంస్థల కేసుల్లో 97.5 శాతం ప్రతిపక్ష పార్టీ నేతలే ఉన్నారన్నారు. ప్రజలు ఈ నిజాన్ని గ్రహించడంతో ఓటమి భయం  పట్టుకున్న ప్రధాని మోదీ.. ఎలక్షన్‌‌ కమిషన్‌‌ను అడ్డుపెట్టుకొని సర్‌ పేరిట ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

 బుధవారం నిజామాబాద్‌‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌‌ పొలిటికల్‌ ‌ఎఫైర్స్‌ ‌కమిటీ మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే నాలుగు సార్లు ఓటు వేసిన వారి నుంచి 2002 నాటి వివరాలు కోరడం ఏమిటని ప్రశ్నించారు. అర్హతగలవారి ఓట్లు పోకుండా బీఎల్‌‌ఏలు, కాంగ్రెస్‌‌ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను తొలగించాలనే బీజేపీ ప్లాన్‌‌ను తిప్పికొట్టాలని చెప్పారు.

 నిజామాబాద్‌ ‌అర్బన్‌ ‌సెగ్మెంట్‌‌లో 30 శాతం ఓట్లు తీసేసి, 40 శాతం మందికి నోటీసు‌లు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌‌ అలీ, జహీరాబాద్‌‌ ఎంపీ సురేశ్​‌షెట్కార్‌‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ ‌మోహన్, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ‌తాహెర్‌‌, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత పాల్గొన్నారు.

సర్‌‌ పర్యవేక్షణలో వెనుకబడ్డం : మంత్రి సీతక్క

ఉమ్మడి జిల్లాలో సర్‌ ‌పర్యవేక్షణ ఆశించిన స్థాయిలో లేదని జిల్లా ఇన్‌‌చార్జ్‌‌ మంత్రి సీతక్క అన్నారు. అధికారం కోసం బీజేపీ చేస్తున్న కుట్రలను ఇప్పుడే అడ్డుకోవాలని, లేకుంటే  భవిష్యత్‌‌ తారుమారవుతుందన్నారు.