- రైతులు, రియల్టర్లతో బేరసారాలు.. కుట్రదారులెవరో తేల్చాల్సిందే..
- ఫీనిక్స్ ఆస్తులు, అక్రమాలపై అసెంబ్లీ వద్ద చర్చకు రెడీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 22ఏ జాబితా పేరుతో లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దాదాపు కోటి ఎకరాలను ఈ జాబితాలో చేర్చి రైతులను, రియల్టర్లను భయపెట్టి బేరసారాలు జరుపుతున్నారని అన్నారు. ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న కుట్రదారులెవరో తేలాలంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 22ఏ జాబితాపై మంత్రుల మధ్యే పొంతన లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ‘‘ఇది అధికారుల తప్పిదమని మంత్రి పొంగులేటి చెబుతుంటే.. కాదు దీని వెనుక పెద్ద కుట్ర ఉందని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. మరి ఆ కుట్రదారులెవరో కోమటిరెడ్డే బయటపెట్టాలి. వివాదం లేని భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై 6 రోజుల క్రితమే శ్వేతపత్రం కోసం నేను డిమాండ్ చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?’’ అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మౌనం చూస్తుంటే ఆయనకు కూడా ఇందులో వాటా ఉందనే అనుమానం కలుగుతోందన్నారు.
అప్పుడు బినామీ.. ఇప్పుడు భాగస్వామి..
గతంలో పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఫీనిక్స్ కంపెనీ కేటీఆర్ బినామీ అని, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎం అయ్యాక ఎందుకు సైలెంట్ అయ్యారని ఏలేటి ప్రశ్నించారు. అప్పుడు కేటీఆర్ బినామీగా ఉన్న ఫీనిక్స్.. ఇప్పుడు తన రూ. 15 వేల కోట్ల ఆస్తులను మంత్రి పొంగులేటి కుటుంబ కంపెనీలకు బదిలీ చేసిందని ఆరోపించారు. కేసీఆర్ బినామీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రికి భాగస్వామి అయ్యారని, అందుకే రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
ఈ భూ దందా వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ సీఎం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తెలంగాణను దోచుకుంటున్నాయని, దీన్నే తాము జాయింట్ వెంచర్ లూటీ అని పిలుస్తున్నామన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి స్కామ్‌లపై విచారణలు కేవలం పొలిటికల్ డ్రామాలు మాత్రమేనని, 32 నెలలైనా ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి రా..
తనపై వచ్చిన ఆరోపణలను తాటాకు చప్పుళ్లుగా మంత్రి పొంగులేటి కొట్టిపారేస్తున్నారని ఏలేటి తప్పుబట్టారు. మంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావా లని సవాల్ విసిరారు. మీడియా సాక్షిగా ఫీనిక్స్ ఆస్తుల బదలాయింపు, ఆయన అక్రమాలపై బహిరంగ చర్చ చేద్దామని, అక్కడ అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఇస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ చర్చకు రాక పోతే పొంగులేటి తన అవినీతిని అంగీకరించినట్లేనని, ఆ ఆధారాలన్నీ ఈడీ, సీబీఐకి ఇస్తామన్నారు.
