మెస్సీ వీడ్కోలు ప్రసంగంతో అర్జెంటీనా ఫ్యాన్స్‌ కన్నీళ్లు.. ఎంజో ఫెర్నాండెజ్ రియాక్షన్ వైరల్!

మెస్సీ వీడ్కోలు ప్రసంగంతో అర్జెంటీనా ఫ్యాన్స్‌ కన్నీళ్లు.. ఎంజో ఫెర్నాండెజ్ రియాక్షన్ వైరల్!

Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తన అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు కన్నీటి వీడ్కోలు పలికాడు. బెనిన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3–0 తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత.. ఎస్టాడియో మోన్యుమెంటల్ (Estadio Monumental) స్టేడియంలో మెస్సీ తన చివరి మ్యాచ్‌ను ఆడి జాతీయ జట్టుకు అధికారికంగా గుడ్ బై చెప్పాడు. ఈ వీడ్కోలు కార్యక్రమం స్టేడియంలోని ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేయగా.. ముఖ్యంగా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కంటతడి పెట్టుకోవడం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ఎంజో ఫెర్నాండెజ్: 

అర్జెంటీనా తరఫున తన 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ లియోనల్ మెస్సీ స్టేడియంలోని వేల మంది అభిమానుల మధ్య మాట్లాడారు. తన కలలను సాకారం చేసుకోవడంలో సహాయపడిన సహచర ప్లేయర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మైదానంలోనూ, మైదానం వెలుపల కూడా తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరితో అనుబంధం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మాటలను వింటూ పక్కనే ఉన్న యువ స్టార్ మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ (Enzo Fernandez) తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు ఆపుకోలేకపోయారు. మెస్సీ అంటే ఆ జట్టుకు, ఆ తరం ఆటగాళ్లకు ఎంతటి గౌరవమో ఎంజో కన్నీళ్లు కళ్లకు కట్టాయి.

21 ఏళ్ల చరిత్రకు ముగింపు పలికిన ఫుట్‌బాల్ లెజెండ్:

బెనిన్‌తో జరిగిన ఈ వీడ్కోలు మ్యాచ్‌లో మెస్సీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఒక గోల్ చేయడంతో పాటు మరో గోల్‌కు అసిస్ట్ అందించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ తర్వాత మెస్సీ మాట్లాడుతూ.. అర్జెంటీనా జెర్సీని విడనాడడం ఎంతో బాధాకరం. అయితే తాను సాధించిన విజయాలతో సంతృప్తిగా రిటైరవుతున్నానని పేర్కొన్నాడు. అర్జెంటీనాకు ఎంతోకాలం తర్వాత ప్రపంచకప్‌ను అందించిన ఈ స్వర్ణయుగానికి మెస్సీ వీడ్కోలు పలకడంతో ఫుట్‌బాల్ ప్రపంచం ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది.