హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ముసుగులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని మంత్రి వివేక్ ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో లేని వందల ఎకరాల భూములు ఎక్కడి నుండి వచ్చాయో కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మందమర్రి మండలం లేమూరు వెంకటాపూర్ గ్రామ శివారులో 3 కోట్లతో నూతనంగా చేపట్టే 33/11 KV సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు బుధవారం (అక్టోబర్ 7) మంత్రి వివేక్ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలో రైతుల పంట పొలాలకు నిరంతరాయంగా కరెంట్ ఉండాలంటే సబ్ స్టేషన్లు ఏర్పాటు అవసరమన్నారు. నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం.. పెంకుటిల్లు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుదామని చెప్పారు.
మహిళల బస్సు ప్రయాణాల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం 13 వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి చెల్లించిందన్నారు. చెన్నూరులో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మందమర్రి లో 50 పడకల ఆస్పత్రిని వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తీసుకొస్తా. 100 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను చెన్నూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.
40 కోట్లతో రసూల్ పల్లి నుండి చిత్రకుంట వరకు రోడ్ నిర్మాణ పనులకు అనుమతి మంజూరు అయ్యిందని చెప్పారు. ఎల్ నినో ఎఫెక్ట్‌తో భవిష్యత్తులో తాగునీటి సమస్య రావచ్చు ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతులందరూ వరి పంటలు వేయకుండా ఆరుతడి వేసుకోవాలని చెప్పారు.
