బైక్ ధర కంటే చలాన్లే ఎక్కువ: రూ. 2.60 లక్షల ఫైన్ ఉన్న బైక్‌ను సీజ్ చేసిన పోలీసులు!

బైక్ ధర కంటే చలాన్లే ఎక్కువ: రూ. 2.60 లక్షల ఫైన్ ఉన్న బైక్‌ను సీజ్ చేసిన పోలీసులు!

గురుగ్రామ్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ. 2.6 లక్షల పెండింగ్ చలాన్లు  ఉన్న ఒక బైక్‌ను పోలీసులు పట్టుకున్నారు. గురుగ్రామ్‌లోని సదర్ బజార్ సమీపంలో ఉన్న అగ్రాసేన్ చౌక్ వద్ద మంగళవారం ట్రాఫిక్ పోలీసులు  వాహనాల చెకింగ్  చేపట్టారు. ఈ క్రమంలో ఒక బైక్ ని ఆపి, బండికి సంబంధించిన పేపర్స్ చూపించాలని డ్రైవర్‌ను అడగ్గా.. అతను ఎలాంటి డాక్యుమెంట్లు చూపించలేకపోయాడు.

పోలీసుల తనిఖీల్లో  సంచలన విషయాలు:
ఆ బైక్ నంబర్‌ను ఆన్‌లైన్ సిస్టమ్‌లో సెర్చ్ చేయగా, మోటార్ వాహనాల చట్టం కింద ఆ బండిపై ఏకంగా 80 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. ఆ 80 చలాన్ల మొత్తం జరిమానా విలువ రూ. 2,60,000 (రెండు లక్షల అరవై వేలు) గా ఉంది. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC) లేకపోవడం, సరైన నంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడపడం వంటి ఉల్లంఘనలకే ఈ చలాన్లన్నీ పడ్డాయి. దీంతో పోలీసులు ఆ బైక్‌ను సీజ్ చేసి,  పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక:
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై, చాలా కాలంగా చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారిపై మోటార్ వాహనాల చట్టం-1988 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ పోలీసులు  తెలిపారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని అలాగే పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని సూచించారు. నిబంధనలు పాటించడం వల్ల వాహనదారులతో పాటు తోటి ప్రయాణికుల భద్రతకూ మేలు జరుగుతుందని తెలిపారు.