అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన H-1B వీసా నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగాలను రిక్రూట్ చేసుకోవటం కష్టమవ్వడంతో గ్లోబల్ కంపెనీలు ఇప్పుడు హెచ్-1బి వీసాలపై ఆధారపడటం తగ్గించాయి. దానికి బదులుగా నేరుగా ఇండియాలోనే 'గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను (GCC)' ఏర్పాటు చేస్తూ స్థానిక ఉద్యోగులను భారీగా రిక్రూట్ చేసుకోవటం స్టార్ట్ చేశాయి. అమెరికా వీసా సంక్షోభాన్ని మన దేశం ఒక గొప్ప అవకాశంగా మార్చుకుంటూ ముందుకెళుతోంది.
ఈ పరిస్థితులు భారతీయ జాబ్ మార్కెట్‌లో జీసీసీల హవా విపరీతంగా పెంచాయని క్వెస్ కార్ప్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. డిసెంబర్ త్రైమాసికంలో 4-6%గా ఉన్న జీసీసీ హైరింగ్.. మార్చి త్రైమాసికానికి ఏకంగా 12-14%కి పెరిగింది. ప్రస్తుతం భారతదేశ ఐటీ హైరింగ్ డిమాండ్‌లో జీసీసీల వాటా దాదాపు 27%కి చేరుకుంది. ప్రస్తుతం భారత్‌లో 2వేల100కి పైగా జీసీసీలు ఉండగా.. 2030 నాటికి ఈ రంగం ద్వారా సుమారు 27 లక్షల మంది నిపుణులు ఉపాధి పొందుతారని అంచనా.
ఈ హైరింగ్‌లో AI, స్పెషలైజ్డ్ నైపుణ్యాలదే పైచేయిగా ఉంది. కొత్తగా రిక్రూట్ అవుతున్న ఉద్యోగాల్లో దాదాపు మూడింట రెండు వంతుల భాగం ఏఐ నైపుణ్యాలవల్లే వస్తున్నాయి. జెనెరేటివ్ ఏఐ హైరింగ్ ఏకంగా 178% పెరగగా.. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్ డిమాండ్ కూడా భారీగా పెరిగిందట. కేవలం టెక్నాలజీ రంగమే కాకుండా 65% హైరింగ్ నాన్-టెక్నాలజీ విభాగాలైన ఆపరేషన్స్, ఫైనాన్స్, హెచ్ఆర్, కంప్లైయన్స్ వంటి వాటిలో జరుగుతుండటం కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తోంది.
కంపెనీలు ప్రస్తుతం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. నేరుగా ప్రాజెక్ట్‌లలో పనిచేయగల 'డిప్లాయ్‌మెంట్-రెడీ' టాలెంట్‌ను కోరుకుంటున్నాయి. దీంతో ఫ్రెషర్ల హైరింగ్ 2024లో 28% ఉంటే, 2025 నాటికి అది 15%కి పడిపోయింది. దీనివల్ల 4 నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులకే ప్రధానంగా డిమాండ్ ఏర్పడింది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల వాటా కూడా 25%కి పెరిగింది. బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పాటు కోయంబత్తూర్, అహ్మదాబాద్, కొచ్చి వంటి టైర్-2 నగరాలు కూడా జీసీసీలకు అడ్డాగా మారుతున్నాయి.
కొత్తగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశిస్తున్న వారిలో 18-25 మరియు 18-30 వయస్సు వారే అత్యధికంగా ఉంటున్నారు మనదేశంలో. అమెరికా వీసా రూల్స్ కఠినతరం కావడం వల్ల విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. దేశంలోనే గ్లోబల్ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కడం భారతీయ యువతకు కలిసి వస్తోందని చెప్పుకోవాలి. ట్రంప్ సర్కార్ నిర్ణయాలతో అక్కడ కోల్పోతున్న అవకాశాలు తిరిగి జీసీసీలతో ఇండియాలోనే దక్కటంపై యువత కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
