ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేపడుతున్న అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రయోజనం అందేలా ఆఫీసర్లు పని చేయాలని దిశా కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి సూచించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకర, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి ఎంపీ అధ్యక్షతన దిశా కమిటీ సమావేశం నిర్వహించారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఎంపీ మాట్లాడుతూ పనుల అమలులో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పూర్తయిన పంచాయతీరాజ్ పనులను సంబంధిత ఎమ్మెల్యేలకు అప్పగించాలని, ఉపాధి హామీ, ఎంపీ ల్యాడ్స్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. డీఎంఎఫ్‌టీ నిధుల వినియోగంపై నివేదిక సమర్పించాలని, కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, డీఎఫ్‌వో, సబ్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
