- రూ.40 లక్షలు ఇవ్వకుండా అడ్డుతొలగించుకునేందుకు యత్నం
- హత్య చేసేందుకు రూ.5 లక్షల సుఫారీ
- కేసును ఛేదించిన పోలీసులు
పాల్వంచ, వెలుగు: స్నేహితుడికి ఇవ్వాల్సిన రూ.40 లక్షల అప్పును ఎగ్గొట్టేందుకు అతడిని హత్య చేయాలని పన్నిన కుట్రను పాల్వంచ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం టౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీశ్ కుమార్ వెల్లడించారు. పాల్వంచకు చెందిన బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు, ఎన్‌హెచ్-9 ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ మానుపూరి ప్రభాకర్ తన స్నేహితుడు పాల నాగేశ్వరరావుకు రూ.40 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఇటీవల అప్పు తిరిగి చెల్లించాలని ప్రభాకర్ ఒత్తిడి చేశాడు. దీంతో అతడి అడ్డు తొలగిస్తే అప్పు చెల్లించాల్సిన అవసరం ఉండదని భావించిన నాగేశ్వరరావు, కొత్తగూడెం పెట్రోల్ బంక్ లో పంప్ ఆపరేటర్ దాసరి రాజును సంప్రదించాడు. రాజు రౌడీషీటర్ ఆరవ వినయ్ కుమార్‌తో కలిసి ప్రభాకర్‌ను హత్య చేసేందుకు పథకం పన్నారు.
ఇందుకు నాగేశ్వరరావు రూ.5 లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు ఇచ్చాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 7న మధ్యాహ్నం పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో ప్రభాకర్, నాగేశ్వరరావు మద్యం సేవించారు. చీకటి పడిన తర్వాత మద్యం దుకాణం నుంచి బయటకు వచ్చిన నాగేశ్వరరావు ఫోన్ ద్వారా ప్రభాకర్ కదలికలను రాజు ద్వారా వినయ్ కుమార్‌కు చేరవేశాడు. దీంతో వినయ్ కుమార్ కొత్తగూడెం మధురబస్తీకి చెందిన ఎడగల శివకృష్ణ, సన్యాసిబస్తీకి చెందిన దాకూరి గణేశ్సహాయంతో మద్యం దుకాణం బయట వేచి ఉన్న ప్రభాకర్‌పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులను శనివారం అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
