- పూర్తి స్థాయి విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బిల్డింగ్ పర్మిషన్ త్వరగా ఇప్పిస్తామంటూ నిర్మాణదారుల నుంచి కొందరు మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న నిర్ధారణకు వచ్చారు.
ఈ వ్యవహారంపై టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు మధ్యవర్తుల బ్యాంకు స్టేట్ మెంట్లు, యూపీఐ లావాదేవీల ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. తనిఖీల సందర్భంగా కార్యాలయ రికార్డులు, ఆదాయ సంబంధిత లావాదేవీలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రికార్డులను, ఇతర లావాదేవీలను పూర్తిగా పరిశీలించాక, అధికారులను విచారించాక పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.
పైసలిస్తేనే పనులకు గ్రీన్ సిగ్నల్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనులు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆఫీసర్ల వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. అన్ని రకాల పత్రాలు, ఫీజులు చెల్లించినా, నిబంధనలు పాటించినా వారికి మామూళ్లు ఇవ్వనిదే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలిసింది.
ఇంటి పర్మిషన్ కోసం ప్లాన్ గీసి ఆన్ లైన్ లో అప్లై చేసే లైసెన్స్డ్ సర్వేయర్లే అధికారులకు, నిర్మాణదారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిర్మించే ఫ్లోర్లు, విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో ఇంటి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
మధ్యవర్తుల నుంచి వచ్చే ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తూ, నేరుగా వచ్చే వారి ఫైళ్లను మాత్రం సెట్ బ్యాక్ లు, నిబంధనల పేరిట సవాలక్ష సాకులు పక్కన పెడుతున్నట్లు తెలిసింది. ఇలాంటి ఫైళ్లను షాట్‌ఫాల్స్‌పేరుతో తిప్పి పంపుతున్నారు.
కొన్ని చోట్ల 30 ఫీట్లకు రోడ్డుకు బదులు 20, 25 ఫీట్ల రోడ్డు ఉన్నా.. డబ్బులు ఇస్తే సైలెంట్ అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విభాగంలో పనిచేసే కీలక అధికారిపై చాలా కాలంగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారనే ప్రచారం
జరుగుతోంది.
