కరీంనగర్లో..డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం..రూ.80 కోట్లతో డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం

కరీంనగర్లో..డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం..రూ.80 కోట్లతో డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం
  • రూ.630 కోట్లతో మోడల్ రోడ్లు, 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, 1 స్కై వాక్, జంక్షన్ల అభివృద్ధి
  •     రూ.130 కోట్లతో వాటర్ డ్రెయిన్స్
  •     బల్దియాకు 130 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు
  •     యూసీఎఫ్ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంతృప్తి 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​లో డంపింగ్ యార్డు సమస్య శాశ్వత పరిష్కారానికి సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్ యూనిట్ ను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. యూసీఎఫ్ నిధుల్లోని రూ.80 కోట్లతో ఈ యూనిట్​ను ఏర్పాటు చేయబోతున్నారు. నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను సేకరించి ప్రాసెసింగ్ కేంద్రంలో వేరు చేసి, రీసైకిల్ చేసి శాస్త్రీయంగా పారవేయడం కోసం ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్ ప్రాజెక్టు - ట్రాన్స్​ఫర్ స్టేషన్, ప్రాసెసింగ్ యూనిట్’ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. 

అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రతిపాదనలపై చర్చించేందుకు కరీంనగర్ ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్, మున్సిపల్ అధికారులతో కేంద్ర మంత్రి బుధవారం భేటీ అయ్యారు. రూ.840 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్(యూసీఎఫ్) నిధులతో అధికారులు రూపొందించిన యూసీఎఫ్ ప్రతిపాదనలను పరిశీలించారు.  

ప్రతిపాదనలు ఇవే.. 

రూ.630 కోట్లతో కరీంనగర్​లో 40 ఫీట్లు అంతకంటే ఎక్కువ మోడల్ రోడ్లను 50 కి.మీ.ల మేర నిర్మాణం, జిల్లా కోర్టు, సివిల్ ఆస్పత్రి, గీతాభవన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద స్కై వాక్(హైదరాబాద్​లోని ఉప్పల్ తరహాలో) నిర్మించేందుకు డిజైన్లు రూపొందించారు. అలాగే నగరంలోని ట్రాఫిక్ జంక్షన్లను గుర్తించి వాటిని కూడా సుందరంగా అభివృద్ధి చేయడంపాటు 130 ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. నగరంలో చిన్నపాటి వర్షానికే అక్కడక్కడా రోడ్లపై నీరు చేరి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున వర్షపు నీటిని తరలించేందుకు మొత్తం 80 కిలోమీటర్ల పొడవునా వర్షపు నీటి కాల్వలన నిర్మించాలని నిర్ణయించారు. 

కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్​కు బండి సంజయ్ ఫోన్.. 

యూసీఎఫ్ ప్రతిపాదనలపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్,  రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి, ఈఎన్ సీ అధికారులతో ఫోన్​లో మాట్లాడారు. యూసీఎఫ్ ప్రతిపాదనలను యుద్దప్రాతిపదికన ఆమోదించి టెక్నికల్ సాంక్షన్స్ మంజూరు చేయాలని కోరారు. ప్రతిపాదనలు అమోదం పొందిన వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి యూసీఎఫ్ నిధులతో ఆయా అభివృద్ధి పనులను చేపట్టాలని మున్సిపల్ కమిషనర్​కు సూచించారు. యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ రూపురేఖలు మారిపోతాయని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.