వెలుగు ఓపెన్ పేజీ.. చిన్నచూపు చూస్తే ప్రాణాలకే ముప్పు

వెలుగు ఓపెన్ పేజీ.. చిన్నచూపు చూస్తే ప్రాణాలకే ముప్పు

కీటకాల జాతికి  చెందిన  దోమలు 3 నుంచి 10 మి.మీ వరకు పొడవు కలిగి ఉంటాయి.  చిన్నవే  కదా అని వీటిని చిన్నచూపు చూస్తే  ప్రాణాలకే  చేటును తెచ్చిపెడతాయి.  దోమకాటు వల్ల ప్రమాదకరమైన మలేరియా, డెంగ్యూ, చికున్‌‌‌‌‌‌‌‌గున్యా, ఎల్లోరా ఫివర్‌‌‌‌‌‌‌‌, జీకా వైరస్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌సిఫిలైటిస్‌‌‌‌‌‌‌‌, వెస్ట్‌‌‌‌‌‌‌‌ నైల్‌‌‌‌‌‌‌‌ వైరస్‌‌‌‌‌‌‌‌ లాంటి పలు ప్రాణాంతక వ్యాధులు కలుగుతున్నాయి.  దోమలు విస్తృతంగా పెరగడానికి అనువైన వాతారణం భారత్‌‌‌‌‌‌‌‌లో ఉండడంతో దోమకాటు వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతున్నది.  ముఖ్యంగా వానాకాలంలో నీరు నిలువ ఉండడం, పచ్చదనం పెరగడంతో దోమల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతోంది.  

దీంతో మలేరియా, డెంగ్యూ లాంటి ప్రమాదకర వ్యాధులు సోకడం జరుగుతోంది.  పేదరికం, పరిసరాల అపరిశుభ్రత, నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా  దోమల సమస్య భారత ప్రజలకు ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ‘మస్‌‌‌‌‌‌‌‌క్విటో’ అనే స్పానిష్‌‌‌‌‌‌‌‌  పదానికి ‘లిటిల్‌‌‌‌‌‌‌‌ ఫ్లై (చిన్న ఈగ)’ అని అర్థం.  తన ఆహారంగా మానవ రక్తాన్ని పీల్చుకునే దోమలు పలు రకాల వ్యాధులను కలిగిస్తున్నాయి. ఆడ అనాఫిలిస్‌‌‌‌‌‌‌‌ దోమకాటు వల్ల మలేరియా వ్యాధి సోకుతున్నది.  దోమకాటు వల్ల మిలియన్ల ప్రజలు మరణించడం కూడా గమనిస్తున్నాం. 

నోబెల్‌‌‌‌‌‌‌‌ బహుమతి గ్రహీత రొనాల్డ్‌‌‌‌‌‌‌‌ రోస్‌‌‌‌‌‌‌‌  దోమలపై విశేష పరిశోధన

దోమకాటు వల్ల మలేరియా వ్యాధి సోకుతుందనే వాస్తవాన్ని  బ్రిటీష్‌‌‌‌‌‌‌‌  మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్  రొనాల్డ్‌‌‌‌‌‌‌‌ రోస్‌‌‌‌‌‌‌‌ అనే శాస్త్రవేత్త  20 ఆగస్టు 1897లో  ప్రపంచానికి  తెలియజేశారు.  దాని గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు 20న ప్రపంచ దేశాలు ప్రపంచ దోమల దినం  లేదా  వరల్డ్‌‌‌‌‌‌‌‌ మస్కిటో డే  పాటించడం ఆనవాయితీగా మారింది.  ఇండియన్  మెడికల్‌‌‌‌‌‌‌‌  సర్వీసు  ద్వారా  సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌  రెజిమెంట్‌‌‌‌‌‌‌‌లో  వైద్యసేవలు అందిస్తూ.. ఆయన చేసిన పరిశోధనల్లో దోమల జీవిత చక్రం, దోమకాటు సంబంధ ప్రయోగాలను నిర్వహించారు.  మలేరియా వ్యాధికి కారణం దోమకాటు మాత్రమే అని రుజువు చేశారు.  దోమల పరిశోధనలపై ఫలితంగా  రొనాల్డ్‌‌‌‌‌‌‌‌ రోస్‌‌‌‌‌‌‌‌ 1902లో  నోబెల్‌‌‌‌‌‌‌‌ బహుమతి పొందారు.   

తీసుకోవలసిన జాగ్రత్తలు

దోమల బెడద లేకుండా చూసుకోవడం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం,  వైద్య సేవలు విస్తరించడం, జాగ్రత్తలు సూచించడం లాంటి విషయాలను ప్రచారం చేయడానికి ప్రపంచ దోమల దినం సందర్భంగా నిర్వహించే వేదికలు ఉపయోగపడుతున్నాయి. నివాస పరిసరాల్లో నీటిని నిలువ ఉండకుండా చూసుకోవడం, నిలువ ఉన్న నీటి పాత్రలపై మూతలు పెట్టడం, మురికి కాలువల్లో నీటిని ప్రవహించేవిధంగా జాగ్రత్తపడాలి.  నిలువ ఉన్న నీటిలో దోమల గుడ్లను తినగలిగే  అంబూచియాలాంటి చేపలు వేయడం, దోమనాశక పెస్టిసైడ్స్‌‌‌‌‌‌‌‌ పిచికారి చేయడం, దోమలను తరమడానికి పొగ యంత్రాలను వినియోగించడం,   శరీరాన్ని పూర్తిగా వస్త్రాలతో కప్పుకునేవిధంగా బట్టలు వేసుకోవాలి.  రోగ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి అని తెలుసుకోవాలి. 

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.