హైదరాబాద్పై దోమల పంజా..రాత్రి లేదు, పగలు లేదు.. 24 గంటలూ కుట్టుడే..

హైదరాబాద్పై దోమల పంజా..రాత్రి లేదు, పగలు లేదు.. 24 గంటలూ కుట్టుడే..
  • దాదాపు అన్ని ఇండ్లల్లో నిద్ర కరువు 
  • దోమల బ్యాట్లు, మస్కిటో రీపెల్లెంట్,  నెట్​లు పెట్టినా నో యూజ్​
  • ఆఫీసులు, బస్టాపుల్లోనూ మచ్చర్లే  
  • రోడ్లపైనా తిరగలేని పరిస్థితి

హైదరాబాద్ సిటీ, వెలుగు : మహానగరంపై దోమలు పంజా విసురుతున్నాయి. సిటీ అంతా దోమలమయం అయిపోయింది. అక్కడ..ఇక్కడ అని కాదు.. ఎక్కడికెళ్లినా వాటి కాటు నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా మారిపోయింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కుడుతూ ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. ఇంట్ల ఉన్నా.. ఆఫీసుకు వెళ్లినా, రోడ్డు పక్కన నిలబడినా, చివరకు సిటీ బస్టాపుల్లో బస్సు కోసం వేచి చూస్తున్నా కామన్​గా ఉండేది దోమకాట్లే.. దీంతో వాటిని నిర్మూలించే దారి తెలియక, అధికారులు పట్టించుకోక వాటితో సహజీవనం చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.

ఇంట్లో 24 గంటలూ గుయ్యా.. గుయ్యా..

ఇప్పుడు నగరంలో ఇండ్లల్లో ఎవరూ నిద్రపోవడం లేదు. పొద్దంతా ఆఫీసుల్లో దోమలతో  బాధపడి.. భయపడుతూ ఇంటికి వస్తే అక్కడా దోమలే స్వాగతం పలుకుతున్నాయి. రాత్రి  ప్రశాంతంగా నిద్రపోదామని కళ్లు మూసుకుంటే చెవుల దగ్గరకు వచ్చి గుయ్యా గుయ్యామని విసుగు తెప్పిస్తున్నాయి. కావాల్సినంత రక్తాన్ని జుర్రుకుంటున్నాయి. పెద్దవాళ్లు కుట్టిన చోట గోక్కుంటూ అడ్జస్ట్ ​అవుతున్నా చిన్నవాళ్లు ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ మాయదారి దోమల గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. కొందరు మస్కిటో బ్యాట్లతో చంపుతున్నా ఒకదాని తర్వాత మరొకటి నాన్​స్టాప్​గా వొడువకుండా వస్తూనే ఉన్నాయి. మస్కిటో రీపెల్లెంట్ రీఫిల్స్ పెడితే అవీ పన్జేయడం లేదు. పైగా వీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 

రీపెల్లెంట్స్​లో ఉండే కెమికల్స్ లేదా నాచురల్​ఆయిల్స్​ గాలిలో కలిసి దోమల్లో వాసన చూసే భాగాలను మొద్దుబారుస్తాయి. అయితే, చాలా కాలంగా దోమలు వీటికీ అలవాటుపడిపోవడంతో వాటికే మస్కా కొట్టే స్థాయికి అప్​డేట్​అయిపోయాయి. జనాలు ఒకే రకమైన కెమికల్స్ వాడుతుండడంతో వాటిలో నిరోధక శక్తి పెరిగి తట్టుకునే శక్తి వచ్చింది. మరికొందరు దోమల నెట్​లను ఆశ్రయిస్తున్నా అందులో ఎక్కడ ఏ మాత్రం సందున్నా దూరిపోయి తెల్లార్లూ రక్తాన్ని పీలుస్తున్నాయి. దీంతో ప్రతి ఇంటి తలుపులకు, విండోలకు మస్కిటో నెట్​లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. 

బయటకు వెళ్లినా వదలట్లే 

ఇంటి కంటే బయటే పదిలం అనుకుంటే అక్కడా దోమల దండు దాడి తప్పట్లేదు. చెరువులు, నాలాలు, మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో దోమలు మరింత రెచ్చిపోతున్నాయి. కాలనీల్లో నడుచుకుంటూ వెళ్తుంటే నోట్లోకి దోమలు వస్తున్నాయని జనం ఆరోపిస్తున్నారు. ఈ సమస్య మూసారంబాగ్, లంగర్ హౌజ్, మలక్ పేట్​, చాదర్​ఘాట్, శంకర్​నగర్​ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. క్యూర్ పరిధిలోని బస్తీలు, కాలనీలతో పాటు అన్ని ప్రాంతాల్లో దోమలు రెచ్చిపోతున్నాయి. 

35 వేల బ్రీడింగ్​ పాయింట్సే....

నాలాలు, చెరువులు, మూసీ ఏరియాల్లో దోమలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే, వీటితో పాటు ఏండ్లుగా తాళాలు వేసి ఉన్న ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు, సెల్లార్లు  ఫంక్షన్ హాల్స్​, కన్ స్ట్రక్షన్ జరుగుతున్న  ప్రాంతాలు, లోతట్టు ఏరియాలూ దోమల పుట్టుకకు అడ్డాలుగా మారాయి. ఇప్పటివరకు ఇలాంటి ప్రాంతాలను లెక్క తీయగా క్యూర్ పరిధిలో మొత్తం 35 వేల  బ్రీడింట్ పాయింట్లు ఉన్నట్టు తేలింది.  

మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? 

అధికారులు దోమల నివారణ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. దోమల నివారణకు ఇండ్ల పరిసరాల్లో, కూలర్లు, పూల కుండీలు, టైర్లు, ఇతర వస్తువుల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రచారం చేయాల్సి ఉన్నా ఎక్కడ అవగాహన కల్పించిన ఆధారాలు లేవు. మాటలే తప్పా ఫీల్డ్​లో వారి చేతలు కనిపించడం లేదు. దోమ‌‌ల నివార‌‌ణలో భాగంగా మూడు కార్పొరేషన్ల పరిధిలో కేవలం ఫాగింగ్ కే ఏటా రూ.12 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ, ఫలితాలు మాత్రం లేవు. యాంటీ లార్వా, పైరత్రామ్, ఐఆర్ఎస్​  స్ప్రే,ఫాగింగ్, చెరువులు, కుంటల వద్ద డ్రోన్ల ద్వారా దోమల నివారణకు  చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ నిధులనూ నొక్కేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు తమకు కూడా ఎస్‌‌ఐఆర్ (సర్​) డ్యూటీలు వేయడంతో  ఫాగింగ్​చేయలేకపోయామని ఎంటమాలజీ విభాగం సిబ్బంది చెప్తున్నారు. టైం లేక యాంటీ లార్వా ఆపరేషన్లు కూడా చేయడం లేదంటున్నారు.  

డెంగ్యూ దోమలపైనే ఫోకస్​ 

మనలను పగలూ, రాత్రి కుట్టే దోమలుంటాయి. ఈ రెండు ప్రమాదకరమైనవే..ఒకటేమో మలేరియాను, మరో రకం డెంగ్యూకు కారణమవుతాయి. పగటి పూట కుట్టే ఈడిస్ దోమ (టైగర్ మస్కిటో ) వల్లే డెంగ్యూతో పాటు చికెన్‌‌గున్యా, జికా వైరస్​వస్తాయి. ఈ దోమలు మురికి నీటిలో పెరగవు. మన ఇండ్లల్లో, చుట్టుపక్కల నిల్వ ఉండే మంచి నీటిలో (కూలర్ నీళ్లలో, కుండీలలో చేరిన వర్షపు నీళ్లలో, పాత టైర్లలో నీళ్లుంటే) గుడ్లు పెడతాయి. వీటితో పాటు రాత్రిపూట కుట్టే అనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వస్తుంది. ఇవి మంచినీళ్లతో పాటు కొద్దిగా పాకురు పట్టిన నీళ్లలో పెరుగుతాయి. ఈ రెండూ కాకుండా రాత్రి కుట్టే మరో దోమ క్యూలెక్స్..ఇవే గుయ్యా గుయ్యా మని సౌండ్​చేసి ఇరిటేట్​చేస్తాయి. వీటివల్ల బోదకాలుతో పాటు జపనీస్ ఎన్సెఫలైటిస్ (మెదడు వాపు జ్వరం) వస్తుంది. ఇవి మురికి కాలువలు, సెప్టిక్ ట్యాంకులు, నిల్వ ఉన్న మురికి నీళ్లలో పెరుగుతాయి. అధికారులు మాత్రం డెంగ్యూ దోమలపైనే ఫోకస్​పెడుతూ మిగతా వాటి నిర్మూలనను మర్చిపోతున్నారు. 

లంగర్ హౌస్ లో మస్కిటో టవర్స్

లంగర్ హౌస్ లోని కట్ట చెరువు వద్ద లక్షలాది దోమలు రెండు మూడు టవర్ల మాదిరిగా కనిపిస్తున్న వీడియోలు బుధవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘మర్​ జాతే లంగర్​హౌస్​ వాలే ఐసా రహాతో..క్యా హై యే..యే దిఖ్​రే లంబే లంబే..క్యాయే టవరా నహీ హోతే..పూరే మచ్చర్​ కా లైనా..ఏక్​..దో..తీన్..కాలా కాలా కైసా దిఖ్​రా..​’ అంటూ వీడియోలో మాట్లాడడం కనిపించింది.  దాదాపు మూడేండ్లుగా ఈ చెరువు క్లీన్​చేయడం లేదని, దీంతో గుర్రపు డెక్క పెరిగి, పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమల టవర్లు తయారయ్యాయని స్థానికులు చెప్తున్నారు  

ఫాగింగ్​ పనిచేయట్లే ..

దోమల నివారణకు ఫాగింగ్​చేస్తున్నామని చెప్తున్నా ఎక్కడ చేస్తున్నారో కనిపించడం లేదు. అక్కడక్కడా డీజిల్, పెట్రోల్​తో చేస్తున్న థర్మల్ ఫాగింగ్ వల్ల దోమలు చావడం లేదు. కేవలం పారిపోతున్నాయి..దీనివల్ల కాలుష్యం కూడా పెరుగుతోంది. అయితే, ఫాగింగ్ అనేది దోమల నిర్మూలనకు పూర్తి పరిష్కారం కాదని సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే ఫాగింగ్​వల్ల బతికి ఉన్న దోమలు చనిపోతాయని, నీటిలో ఉండే గుడ్లు, లార్వాలను చంపలేదంటున్నారు. 

మొక్కలూ హెల్ప్​చేస్తాయ్​

ఇంటి బాల్కనీలో లేదా కిటికీల దగ్గర కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు. అందులో తులసి ఒకటి . ఈ మొక్క నుంచి నుంచి వచ్చే ఘాటైన వాసన దోమలను ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అలాగే, నిమ్మగడ్డి నుంచి వచ్చే వాసన దోమలకు పడదు. ఇక పుదీనా, లావెండర్ మొక్కల వాసన ఇల్లాంతా మంచి పరిమళాన్ని ఇస్తుంది. అలాగే, దోమలను తరిమికొడుతుంది.

ఇలా చేయండి

  •  కర్పూరం : గది తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి కొద్దిగా కర్పూరాన్ని వెలిగించి 20 నిమిషాలు వదిలేయాలి. దీని ఘాటైన సువాసనకు దోమలన్నీ పారిపోతాయి.
  • నిమ్మకాయ , లవంగాలు : నిమ్మకాయను అడ్డంగా కోసి, ఆ ముక్కల్లో కొన్ని లవంగాలను గుచ్చాలి. దీన్ని రూమ్​లో లేదా మంచం పక్కన పెట్టుకుంటే ఆ వాసనకు దోమలు రావు.
  • వేప నూనె స్ప్రే : గ్లాసు నీటిలో టీస్పూన్ వేప నూనె, కొద్దిగా బేకింగ్ సోడా కలిపి ఇల్లంతా స్ప్రే చేయడం వల్ల దోమల బెడద తప్పుతుంది.లావెండర్, లెమన్‌‌గ్రాస్, సిట్రొనెల్లా లేదా పుదీనా నూనెలను డిఫ్యూజర్‌‌లో వేసి గదిలో ఉంచితే దోమలు దూరంగా ఉంటాయి