ప్రజల సొమ్ముతో ఉచిత పథకాలా?.. భూ నిర్వాసితులకు పరిహారం ఏది: హైకోర్టు

ప్రజల సొమ్ముతో ఉచిత పథకాలా?.. భూ నిర్వాసితులకు పరిహారం ఏది: హైకోర్టు
  • భూములు తీసుకొని నిర్వాసితులకు పరిహారం ఇవ్వట్లే
  • పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనాలు అందట్లే
  • చెల్లింపుల విషయంలో మీ ప్రాధాన్యత ఏమిటి?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
  • పథకాల అమలుకు చట్టబద్ధత తేలాలి
  • కల్యాణ లక్ష్మిపై స్టే ఎత్తివేతకు నిరాకరణ.. విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, వెలుగు: ప్రజల సొమ్మును ఉచిత పథకాల కోసం వెచ్చించడం ఎంతవరకు సబబని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పథకాలు అమలు చేయవద్దని తాము చెప్పడంలేదని, కానీ చెల్లింపుల వ్యవహారంలో ప్రభుత్వ ప్రాధాన్యాలేమిటో తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌‌‌లాంటి పథకాల అమలు, భూసేకరణ బాధితుల పిటిషన్లపై విచారణ సందర్భంగా బుధవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

భూసేకరణలో భాగంగా ఉన్న కొద్దిపాటి భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన సన్న, చిన్నకారు రైతులు పరిహారం కోసం ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వాపోయింది. పరిహారం కోసం కోర్టు ధిక్కరణ కేసులు దాఖలవుతున్నాయని, అధికారులు కోర్టులకు వచ్చి నిధుల కొరత ఉందని వాయిదాలు కోరుతున్నారని గుర్తుచేసింది. పథకాలు అమలు చేయడంతోపాటు ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టుల పై ఉందని వ్యాఖ్యానించింది. అప్పులు చేసి పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఏమిటని, ఆర్టీసీలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తీసుకువచ్చి ఆ లాభాలను సంక్షేమ పథకాల కోసం ఎందుకు ఖర్చు చేయరని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలు ప్రజలకు భారం కాకూడదని, విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌ పథకాలపై స్టే తొలగించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉందంటూ స్టే ఎత్తివేతకు నిరాకరించింది.  విచారణను గురువారానికి వాయిదా వేసింది. 
 బాల్య వివాహాల్ని అరికట్టేందుకే: ఏఏజీ..
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌‌‌‌ పథకాల కోసం ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌‌‌‌గోపాల్‌‌‌‌ వ్యక్తిగత హోదాలో హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ శ్రవణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ మహమ్మద్‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌ఖాన్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్‌‌‌‌ విచారణార్హం కాదని,  ఇది బాల్య వివాహాలను అరికట్టడానికి, బాలికల విద్యను ప్రోత్సహించడానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకమని పేర్కొన్నారు. తెలంగాణలో వివాహానికి ఎదిగిన యువతుల కుటుంబానికి ఒకేసారి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో సీఎం బాలికా వివాహ్, మధ్యప్రదేశ్‌‌‌‌లో లాడ్లీ లక్ష్మీ యోజనలాంటి పథకాల ద్వారా సాయం అందిస్తు న్నారన్నారు. రాజస్థాన్‌‌‌‌లో బాలిక వివాహ సాయం పథకాల ద్వారా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నవారికి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. ఈ పథకాలు బాల్య వివాహాలను తగ్గించడంతోపాటు విద్యను ప్రోత్సహించడంలో కీలకంగా ఉన్నాయని వివరించారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని కోర్టు వ్యతిరేకించడంలేదని, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడంలో అనుసరిస్తున్న ప్రాధాన్యతను గురించి తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. పథకాల అమలుకు చట్టబద్ధత గురించి చెప్పాలని, ప్రభుత్వ జీవోలు, ఆర్థిక శాఖ అనుమతులు సరిపోతాయా?  అని ప్రశ్నించారు. దీనిపై అదనపు ఏజీ స్పందిస్తూ.. పథకం కోసం బడ్జెట్‌‌‌‌లో కేటాయింపులు జరిగినప్పుడు ప్రత్యేకంగా చట్టం అవసరం లేదని చెప్పారు. బడ్జెట్‌‌‌‌లో కేటాయింపులను శాసనసభ మొత్తం ఆమోదిస్తుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రుణాలు చేసి పథకాలను అమలు చేయడంలేదని, ప్రభుత్వ నిధులతోనే చేస్తున్నట్టు తెలిపారు. పిటిషనర్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ రాష్ట్రానికి అప్పులు లేవని చెప్పడం సరికాదని, దీనికి సంబంధించి న వివరాలను కౌంటరులో ఎక్కడా పేర్కొనలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బహిరంగ వేదికల్లో రూ.1.04 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని చెప్పారు.  కన్సాలిడేటెడ్‌‌‌‌ ఫండ్‌‌‌‌ నుంచి నిధులను చట్టబద్ధమైన అనుమతుల్లేకుండా ఖర్చు పెట్టరాదన్నారు. తాను పథకాలకు వ్యతిరేకం కాదని, చట్టప్రకారం చెల్లింపులు జరగాలన్నదే ఉద్దేశమని, భవిష్యత్తరాల కోసమేనని పేర్కొన్నారు. జీవోల మీద దశాబ్దాల తరబడి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఏఏజీ వాదనలు కొనసాగిస్తూ కౌంటరు దాఖలు చేశామని, ప్రస్తుతం పిటిషనర్‌‌‌‌ లేవనెత్తిన అంశాలపై సమగ్ర కౌంటరు దాఖలు చేస్తామన్నారు. స్టే ఎత్తివేయాలని కోరగా న్యాయమూర్తి స్పందిస్తూ.. దీనిపై సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందంటూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.