కోట్లల్లో దందా చేస్తున్రు..30 ఏండ్ల క్రితం కొన్న ఇండ్లనూ నిషేధిత జాబితాలో పెట్టిన్రు: హరీశ్‌‌‌‌రావు

కోట్లల్లో దందా చేస్తున్రు..30 ఏండ్ల క్రితం కొన్న ఇండ్లనూ నిషేధిత జాబితాలో పెట్టిన్రు: హరీశ్‌‌‌‌రావు
  • బాధితులకు ఉచితంగా న్యాయ సాయం అందిస్తం
  • తెలంగాణ భవన్‌‌‌‌లో లీగల్​ సెల్​ ఏర్పాటు చేస్తున్నం
  • ఆ భూములను బయటకు ఎలా తీయించాలో తెలుసని కామెంట్‌‌‌‌
  • తెలంగాణ భవన్​లో 22ఏ బాధితులు, సర్వేయర్లతో వేర్వేరుగా సమావేశం

హైదరాబాద్​, వెలుగు: హుడా, హెచ్‌‌‌‌ఎండీఏ అప్రూవ్డ్​ లే అవుట్లలో 30 ఏండ్ల క్రితం కొనుక్కున్న ఇండ్లను కూడా 22ఏ జాబితాలో పెట్టారంటే ఎంత పెద్ద కమీషన్ల దందా నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్‌‌‌‌ రావు అన్నారు. ఈ పేరుతో కోట్లాది రూపాయల దందా చేస్తున్నారని ఆరోపించారు. 22ఏ బాధితులెవరూ ఆందోళన చెందొద్దని, బీఆర్ఎస్​ పార్టీ తరఫున 10 మంది న్యాయవాదులతో లీగల్​ సెల్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

బాధితులందరికీ ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు. బుధవారం తెలంగాణభవన్‌‌‌‌లో 22ఏ బాధితులు, లైసెన్స్డ్​ సర్వేయర్లతో హరీశ్‌‌‌‌రావు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లీగల్ సెల్ సపోర్ట్‌‌‌‌తోపాటు ఎమ్మెల్యేలుగా తాము కూడా కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రియల్ ఎస్టేట్ బాగా తెలవొచ్చేమోగానీ.. బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి చేసిన పోరాటాలు బాగా తెలుసని అన్నారు. 

22ఏలో పెట్టిన భూములను బయటకు ఎలా తీయించాలో తమకు బాగా తెలుసని, బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఒక్క ఎకరం కూడా 22ఏలో పెట్టలేదని పది రోజుల క్రితమే మంత్రి పొంగులేటి అన్నారని, ఆయనే ఇప్పుడు అధికారులు పొరపాటు చేశారంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యాదాద్రి జిల్లాలోనే 40 వేల ఎకరాలను 22ఏలో పెట్టారంటూ 4 నెలల క్రితం స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి చెప్పినా సీఎం రేవంత్​ ఎందుకు సైలెంట్‌‌‌‌గా ఉన్నారని నిలదీశారు. ఇదంతా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి ఆడుతున్న వసూళ్ల నాటకమని విమర్శించారు.

 చిన్న చిన్న విషయాలకే సీఐడీ, విజిలెన్స్ విచారణలు వేసే రేవంత్ రెడ్డి.. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న 22ఏ స్కామ్‌‌‌‌పై మాత్రం ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌‌‌‌కు ఈ దందాతో సంబంధం లేకుంటే.. మంత్రి పొంగులేటిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రజలకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఈ ప్రభుత్వం ఒక తుగ్లక్ ప్రభుత్వంలా మారిపోయిందని అన్నారు. 

సర్వేయర్లను కొడ్తరా?

బీటెక్, ఎంటెక్‌‌‌‌, సివిల్ ఇంజనీరింగ్ చదివిన యువతను ఉద్దేశించి ఐఏఎస్ అధికారి లోకేశ్​ కుమార్​.. అత్యంత దారుణంగా మాట్లాడడం దుర్మార్గమని హరీశ్​ రావు మండిపడ్డారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సర్వేయర్లను మంత్రి పొంగులేటి చేతిలో ఏది ఉంటే దానితో కొట్టడానికి ప్రయత్నించడం ప్రభుత్వ అహంకారానికి, అణచివేతకు నిదర్శనమన్నారు.  ఇప్పుడు ఈ 6 వేల మంది లైసెన్స్ సర్వేయర్లు, వారి వెనకున్న 6 వేల కుటుంబాలు ఒక శక్తిగా మారి తిరగబడితే ఏమవుతుందో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆలోచించుకోవాలన్నా రు. 

రేవంత్ రెడ్డి ఏమైనా ఆకాశం నుంచి ఊడి పడ్డారా? సీఎం పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని అన్నారు. ‘అప్పులపాలై, కుటుంబం గడవక ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. మీకు కనీస జీతం లేదు, టీఏ/డీఏలు లేవు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. మీ సొంత డబ్బులు పెట్టుకుని సర్వే చేయాల్సిన దుస్థితి. వంద రూపాయల పెట్రోల్ కొట్టి, 50 రూపాయలు పెట్టి అన్నం తిని.. ఎకరానికి కేవలం 60 రూపాయల చొప్పున సర్వే చేస్తే బతికేదెట్లా? ఇదే విషయం కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తే.. మీరు లంచాలు తీసుకోండి, వసూలు చేసుకోండి అని చెప్పడం ఈ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.