వెలుగు ఓపెన్ పేజీ.. సంక్షోభం దిశగా.. భారత ఆర్థిక వ్యవస్థ

వెలుగు ఓపెన్ పేజీ.. సంక్షోభం దిశగా.. భారత ఆర్థిక వ్యవస్థ

ప్రస్తుతం మన దేశ జీడీపీ వృద్ధి రేటు 7.8% ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ’ అని  గొప్పగా  ప్రకటిస్తున్నారు.  కాగితాల మీద జీడీపీని గొప్పగా చూపిస్తున్నారు.  కానీ వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి.  ఒక ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 10 శాతం మంది తమ అవసరాలు తీరిన తర్వాత,  మిగిలిన డబ్బులను ఇతర ఖర్చులకు  కేటాయించగలుగుతున్నారు. కానీ 90 శాతం మంది ప్రజలు తమ అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనినిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే, పేద, మధ్య తరగతి ప్రజల జీవనం ఆర్థిక భారంతో కొనసాగుతోందని. మే10న హైదరాబాదులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ బంగారం కొనవద్దని,  ఒక సంవత్సరం వరకు విదేశీ పర్యటనలు చేయవద్దని, పెట్రోల్,  డీజిల్ వాడకం తగ్గించాలని, వంట నూనె 10% తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకవైపు భారతదేశ ఎకానమీ పరుగులు పెడుతుందని చెప్తూనే,  మరోవైపు ప్రజలకు వంటనూనె వాడకం తగ్గించాలని ప్రధాని పిలుపునివ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?


మినిస్టరీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ రిపోర్ట్ ప్రకారం మనదేశ అసంఘటిత తయారీ రంగంలో 9.3% ఉద్యోగాలు తగ్గాయి.  గత ఏడాది నుంచి ఇప్పటివరకు మొత్తం 27 లక్షల ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.  మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు సంక్షోభంలో ఉన్న మన దేశ ఆర్థికవ్యవస్థను, అమెరికాతో  మన దేశం అవలంబిస్తున్న విధానాలు మరింత తీవ్రంగా ప్రభావితం చేశాయి.‌‌‌‌‌‌‌‌ అందులో మొదటిది 2025 ఆగస్టులో  అమెరికా మనదేశ ఎగుమతులపై 50% టారిఫ్ విధించడం. ఇందులో 25%  రెస్పాన్స్ టారిఫ్,  మరో 25%  రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా విధించింది. అమెరికా మన దేశ ముఖ్యమైన ట్రేడింగ్ భాగస్వామ్య దేశాలలో ఒకటి.‌‌‌‌‌‌‌‌  దీంతో  మన దేశ ఎగుమతులలో భారీ తగ్గుదల పెరిగింది.  టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్,  జ్యువెలరీ తదితర రంగాలలో 70% ఎగుమతులు తగ్గాయి.  దీంతో  లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలోపడ్డాయి.

రూపాయి విలువ పతనం

2026 ఫిబ్రవరి 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ ఎగుమతులపై 50% టారిఫ్‌‌‌‌‌‌‌‌ను 18 శాతానికి తగ్గించారు. కానీ రెండు షరతులను విధించారు. ఈ రెండు షరతులు కూడా భారత ఆర్థిక వ్యవస్థను‌‌‌‌‌‌‌‌ సంక్షోభంలోకి నెట్టేవే.  అయినా ప్రధాని మోదీ వీటికి అంగీకరించారు. అందులో మొదటిది రష్యా నుంచి చౌకగా వస్తున్న చమురును కొనుగోలు చేయకుండా వెనిజువెలా నుంచి కొనుగోలు చేయాలి.  రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు రష్యా కరెన్సీ రూబెన్స్ రూపంలో చెల్లింపులు చేసేది.‌‌‌‌‌‌‌‌  ప్రస్తుతం వెనిజువెలా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున డాలర్ల రూపంలో చెల్లించాల్సి వస్తుంది. 

ఈ డాలర్లు అమెరికా జేబులోకి వెళ్తున్నాయనేది  వాస్తవం. డాలర్ల రూపంలో చెల్లింపులు  జరపడం మన దేశానికి అదనపు భారంగా మారింది.  రెండోది  అమెరికా నుంచి 500  బిలియన్  డాలర్ల  ఉత్పత్తులను మన దేశం కొనుగోలు చేయాలి.  టారిఫ్‌‌‌‌‌‌‌‌లు  తగ్గించుకోవడానికి  ప్రధాని మోదీ 500 బిలియన్ డాలర్ల అమెరికన్  ఉత్పత్తులను  కొనడానికి అంగీకరించడం దేశ ఆర్థిక వ్యవస్థను  గాలికి వదిలేయడమే.  అమెరికా ఉత్పత్తులను ఎంత ఎక్కువగా కొంటే, అంతగా మన దేశ రూపాయి విలువ తగ్గిపోతుంది. ప్రస్తుతం మన రూపాయి కరెన్సీ చరిత్రలో ఎన్నడూ చూడని పతనాన్ని చవిచూస్తోంది. ఇది దేశ ప్రజలు గ్రహించాల్సిన విషయం.

90% క్రూడ్ ఆయిల్‌‌‌‌‌‌‌‌  దిగుమతి

భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన మరొక సంఘటన 28 ఫిబ్రవరి 2026న మొదలైన‌‌‌‌‌‌‌‌ అమెరికా,  ఇరాన్ యుద్ధం.  ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్‌‌‌‌‌‌‌‌పై దాడులు ప్రారంభించడంతో యుద్ధం మొదలైంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ హార్మూజ్ జల మార్గాన్ని మూసివేసింది.  దీంతో  ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు 58 శాతం, ఫెర్టిలైజర్స్ ధరలు 66% పెరిగాయి. 

ఈ పెరిగిన ధరలు మన దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేశాయి. భారతదేశం తనకు అవసరమైన 90% క్రూడ్ ఆయిల్‌‌‌‌‌‌‌‌ను  దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 55% వరకు మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతి అంతా హార్మూజ్ జలమార్గం నుంచే వస్తోంది. యుద్ధం వల్ల మన దేశం మార్చి నెలలో 40 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతిని తగ్గించింది.  దీని  ప్రభావం సగటు భారతీయ కుటుంబాల వంట గదుల మీద పడింది.  డొమెస్టిక్  సిలిండర్ ధర ఏకంగా రూ.  60 పెరిగింది. మే నెలలోనే పది రోజుల వ్యవధిలోనే  పెట్రోల్ ధరలు ఏడున్నర రూపాయలు పెరిగింది. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మరింత పెంచింది.

అమెరికా టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో పరిశ్రమలు దివాలా

అమెరికా విధించిన టారీఫ్  ల వల్ల,  ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం వల్ల దేశంలోని అనేక పరిశ్రమలు సంక్షోభంలో  కొట్టుమిట్టాడుతున్నాయి. తమిళనాడులోని తిరుపూర్  వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. దీనిని ‘డాలర్ సిటీ’ అంటారు.  భారతదేశం 16 బిలియన్ల డాలర్ల వస్త్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇది ప్రపంచంలో  రెండో స్థానం.  ఇందులో  మూడో వంతు తిరుపూర్ నుంచే జరుగుతోంది.  అమెరికా విధించిన టారిఫ్‌‌‌‌‌‌‌‌తో  వస్త్ర ఎగుమతులపై 64%కి కంబైన్డ్ డ్యూటీ పెరిగింది.  దీంతో ఎగుమతులు తగ్గాయి. 

ఈ ఇండస్ట్రీలో లక్షన్నర మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రపంచంలో రొయ్యల ఎగుమతుల్లో భారతదేశం మొదటి స్థానం. ప్రతి ఏటా 14 లక్షల టన్నుల రొయ్యలను ఎగుమతి చేస్తుంది. 6 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. ఎగుమతుల్లో 40 శాతం వరకు అమెరికాకే  చేస్తోంది. రొయ్యల ఎగుమతులపై అమెరికా 25% టారిఫ్  విధించింది. దీంతో ఈ పరిశ్రమ దివాలా తీసింది. 

గుజరాత్ లోని సూరత్ నగరం డైమండ్ ఇండస్ట్రీకి ప్రసిద్ధి చెందింది. 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఈ పరిశ్రమను కుదిపేసింది. మన దేశానికి సరిపడే మూడో వంతు డైమండ్స్ రష్యా నుంచి దిగుమతి అయ్యేవి. యుద్ధం వల్ల దిగుమతి తగ్గింది. అమెరికా విధించిన టారిఫ్ లతో ఎగుమతులు కూడా భారీగా తగ్గాయి.  కార్మికులు సూరత్ నగరం వదిలి వెళ్ళిపోయారు.

5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై  ప్రధాని మోదీ మౌనం

కేంద్ర ప్రభుత్వం 2018లో దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక రోడ్ మ్యాప్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. దీనిలో 2025 వరకు 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  దీనికి తొలి డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ 2022 గా ‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది.  ఇది సాధ్యం కాలేదు. ఆ తర్వాత 2025 వరకు  దీనిని  పొడిగించారు. ఇది కూడా సాధ్యం కాలేదు.   ప్రస్తుతం మన దేశ ఎకానమీ 3.9 బిలియన్ డాలర్లు.  

నేడు దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభంతో 2030 వరకు ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదని ఆర్థిక నిపుణుల అంచనా. దీంతో ప్రధాని మోదీ ఇప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గురించి మాట్లాడడం లేదు. 2047లో వచ్చే వికసిత్  భారత్ గురించి మాట్లాడుతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి ఇంత సంక్షోభంలో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఖజానాను ఆదా చేసుకోవడంలో విఫలమయింది.  ఇప్పటికీ  వందల కోట్లను ఖర్చుపెట్టి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు, టూరిస్టు విజిట్‌‌‌‌‌‌‌‌లు చేస్తున్నారు. వేలాది కోట్లను ఖర్చుపెట్టి గోదీ మీడియాలో భారత ఆర్థిక వ్యవస్థ గురించి గొప్పగా ప్రచారం చేయిస్తున్నారు. 

ఈ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు.‌‌‌‌‌‌‌‌ దీంతో దేశ ప్రజలు అధిక ధరలతో అప్పులలో కూరుకుపోతున్నారు.  కేంద్ర ప్రభుత్వానికి భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో చిత్తశుద్ధి, ముందుచూపు లేకపోవడమే దీనంతటికీ కారణం. దీనికి పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

- నుమాన్​ మొహమ్మద్ 
ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.