జగిత్యాల టౌన్, వెలుగు: ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటే తిరిగి పొందవచ్చని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. సాంకేతికత సహాయంతో రికవరీ చేసిన రూ.21 లక్షల విలువైన 102 ఫోన్లను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధితులు నేరుగా సీఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకుంటే ఫోన్‌ను సులభంగా ట్రాక్ చేయవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.4.5 కోట్ల విలువైన 2,024 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు చెప్పారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేముందు ఈ పోర్టల్ ద్వారా ఐఎంఈఐ నంబర్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ చూపిన ఐటీ కోర్ ఇన్స్పెక్టర్, సీఈఐఆర్ టీమ్‌ను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.
