సెప్టెంబరు  15 కల్లా సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు : ఎండీ వీపీ గౌతమ్‌

సెప్టెంబరు  15 కల్లా సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు : ఎండీ వీపీ గౌతమ్‌
  • రూఫ్ రీప్లేస్‌‌మెంట్‌‌ స్కీమ్‌‌పై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలి
  • అధికారులకు హౌసింగ్‌‌ ఎండీ వీపీ గౌతమ్‌‌ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను గుడిసెల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని హౌసింగ్‌‌ కార్పొరేషన్‌‌ ఎండీ వీపీ గౌతమ్‌‌ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 15 నాటికి లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా హౌసింగ్‌‌ పీడీలకు సూచించారు. రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్నోళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌‌ హిమాయత్‌‌నగర్‌‌లోని హౌసింగ్‌‌ ఆఫీస్​లో పీడీలు, డిప్యూటీ ఈఈలతో గౌతమ్‌‌ సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, సిబ్బంది, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు దీనిపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఆర్‌‌సీసీ శ్లాబ్‌‌ (కాంక్రీట్‌‌ పైకప్పు లేకుండా రేకులు, పెంకులు, ఇతర తాత్కాలిక పైకప్పు ఉన్న ఇల్లు) లేని ఇండ్లలో ఉంటున్నోళ్లకు రూఫ్‌‌ రీప్లేస్‌‌మెంట్‌‌ స్కీమ్‌‌ ద్వారా ప్రయోజనం కలుగుతుందని గౌతమ్‌‌ తెలిపారు. ఈ పథకంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పీడీలను ఆదేశించారు. 

27 నుంచి ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌‌ లాటరీ

గ్రేటర్‌‌ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు 27 నుంచి లాటరీ నిర్వహించనున్నట్లు ఎండీ వీపీ గౌతమ్‌‌ తెలిపారు. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున 30 నాటికి ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. హౌసింగ్‌‌ బోర్డు అధికారులు, మీడియా సమక్షంలో లాటరీని పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

లాటరీ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. దరఖాస్తుదారుల వివరాలను గురువారం సాయంత్రం నుంచి మీ సేవవెబ్‌‌సైట్లలో అందుబాటులో ఉంచుతామన్నారు. అభ్యంతరాలుంటే 23 సాయంత్రంలోగా తెలియజేయవచ్చన్నారు. అనంతరం అర్హులైన దరఖాస్తుదారుల తుది జాబితాను 25న ప్రకటిస్తామని ఎండీ తెలిపారు.