పోలీస్ ఉద్యోగాలకు.. కాకా ఫౌండేషన్ ఫ్రీ కోచింగ్ : మంత్రి వివేక్ వెంకటస్వామి

పోలీస్ ఉద్యోగాలకు.. కాకా ఫౌండేషన్ ఫ్రీ కోచింగ్ : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ప్రతి పేద విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగం సాధించే స్థాయికి చేరుకోవాలి: మంత్రి వివేక్​ వెంకటస్వామి
  • చెన్నూరు ప్రాంతం నుంచి ఎక్కువ ఉద్యోగాలు సాధించాలి
  • చెన్నూరు, మందమర్రిలో కోచింగ్​సెంటర్లు ప్రారంభించిన మంత్రి, ఎంపీ వంశీకృష్ణ

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్​అవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల యువత కోసం చెన్నూరు, మందమర్రి పట్టణాల్లో ఉచితంగా కోచింగ్​సెంటర్లు ప్రారంభిస్తున్నట్టు కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. ఖరీదైన కోచింగ్ వారికి భారం కాకూడదన్న ఉద్దేశంతో ‘కాకా వెంకటస్వామి ఫౌండేషన్’​ ఆధ్వర్యంలో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 

ఈ మేరకు ఎస్సై, కానిస్టేబుల్​పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మంచిర్యాల జిల్లా చెన్నూరు, మందమర్రిలో ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్​సెంటర్లను ఆయన బుధవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. పోలీస్​ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. చెన్నూరు ప్రాంతం నుంచి ఎక్కువమంది ఎస్ఐలు, కానిస్టేబుళ్లుగా ఎంపికై రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తేవాలన్నారు. 

ప్రతి పేద విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగం సాధించే స్థాయికి చేరుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా గ్లోబల్ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్రంలో అడ్వాన్స్​డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేశామన్నారు. టామ్ కామ్ సమన్వయంతో జర్మన్, జపనీస్ భాషలో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మందమర్రిలో దాదాపు 100 మందికి జర్మనీ భాషలో శిక్షణ ఇప్పించి, సంవత్సరానికి రూ.25 లక్షల నుంచి 30 లక్షల వేతనాలు లభించేలా విదేశీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. 

కేసీఆర్​ అనాలోచిత నిర్ణయాలతో సింగరేణికి నష్టం 

కేసీఆర్​అనాలోచిత నిర్ణయాలతో సింగరేణిలో లక్ష ఉద్యోగాలు 38 వేలకు పడిపోయాయని మంత్రి వివేక్​మండిపడ్డారు. కొత్త బొగ్గు బ్లాక్​ల కోసం నిర్వహించే వేలంలో సింగరేణి పాల్గొనకుండా కేసీఆర్​అడ్డుకున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంతో మాట్లాడి వేలంలో సింగరేణి పాల్గొనేలా ఒప్పించినట్టు చెప్పారు. దీంతో తాడిచర్ల 2 , మణుగూరు డిప్​సైడ్​ బొగ్గు బ్లాక్​సింగరేణి దక్కించుకుందన్నారు. 

గతంలో కాకా వెంకటస్వామి చొరవతోనే సింగరేణి వేల కోట్ల టర్నోవర్​తో మనుగడ సాగిస్తున్నదన్నారు. వినోద్​మంత్రిగా ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి చొరవతో జైపూర్​లో సింగరేణి ఆధ్వర్యంలో 1,200 మెగావాట్ల పవర్​ ప్లాంట్​ను ప్రారంభించి 5వేల మందికి ఉద్యోగాలు కల్పించారని గుర్తుచేశారు. మరో 850 మెగావాట్ల మూడో యూనిట్ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్​ ఓపెన్​కాస్ట్​ విస్తరణలో భాగంగా రెండో ఫేజ్​ మైన్​ ఫారెస్ట్​ అనుమతి కోసం ఇటీవల పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, తాను కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్​యాదవ్​ను కలిశామన్నారు. త్వరలోనే ఫారెస్ట్​ అనుమతులు వస్తాయని, కొత్త మైన్​ అందుబాటులోకి వస్తే వందలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేసిందని మంత్రి మండిపడ్డారు. 

గొల్లవాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరందించేందుకు అనుమతులు తీసుకున్నామన్నారు. జైపూర్​ మండలంలోని మొసళ్ల మడుగును పర్యాటక కేంద్రంగా (టూరిస్టు సెంటర్​) అభివృద్ధి చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ పథకాలపై కోర్టులో కేసు ఉందని.. సమర్థంగా వాదనలు వినిపించి కేసు గెలుస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్​ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, ఏసీపీ కిరణ్​కుమార్, డీసీసీ ప్రెసిడెంట్​ రఘునాథ్​రెడ్డి పాల్గొన్నారు.

కేటీఆర్​ ఫోజులిచ్చుడు తప్ప పది ఉద్యోగాలైనా ఇప్పించాడా: వంశీకృష్ణ

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఏడాదికి 25 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదం, యువత ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో గత బీఆర్ఎస్​ ప్రభుత్వం యువత ఆకాంక్షలు నెరవేర్చలేదన్నారు. కేటీఆర్​విదేశాలకెళ్లి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్పితే 10మంది నిరుద్యోగులకైనాఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. 

ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిని విమర్శించడాన్ని కేటీఆర్​ మానేయాలని హితవుపలికారు. నిరుద్యోగ యువత విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందడాన్ని కేటీఆర్​ తప్పుబట్టడం సరికాదన్నారు. యువతకు కేసులు కావాలా.. ఉద్యోగాలు కావాలా? ఒక్కసారి ఆలోచించాలన్నారు. -కేటీఆర్ ఒక్కరే అమెరికా వెళ్లాలా? తెలంగాణ యువత విదేశాల్లో ఉద్యోగాలు చేయకూడదా? అన్ని ఎంపీ ప్రశ్నించారు. 

మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో టామ్​కామ్​ ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు విదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయన్నారు. యువతీయువకులు పోలీసు ఉద్యోగాలు సాధించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ ద్వారా ఫ్రీ కోచింగ్​సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ఎంపీ చెప్పారు.