క్యాన్సర్ కు కొత్త మందు..క్యాన్సర్ కణాలనే హతమారుస్తది..హెల్దీ సెల్స్‌‌‌‌కు హాని చేయదు

క్యాన్సర్ కు కొత్త మందు..క్యాన్సర్ కణాలనే హతమారుస్తది..హెల్దీ సెల్స్‌‌‌‌కు హాని చేయదు
  • క్యాన్సర్‌‌‌‌కు స్మార్ట్ డ్రగ్ తయారుచేసిన ఇండియన్ సైంటిస్టులు
  • ‘ఆర్ కే-251’  పేరుతో స్మార్ట్ డ్రగ్
  •  కీమోథెరపీ అవసరం తగ్గొచ్చు
  • సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌ గణనీయంగా తగ్గుతయ్

న్యూఢిల్లీ: క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆశాకిరణం రాబోతోంది. క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిపై మాత్రమే ప్రభావం చూపే స్మార్ట్ డ్రగ్‌‌‌‌ను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘ఆర్ కే-251’ అనేది ఈ స్మార్ట్ డ్రగ్‌‌‌‌ పేరు. సాధారణ కీమోథెరపీలో క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటాయి. దీంతో అనేక దుష్ప్రభావాలు ఎదురవుతాయి. ఈ కొత్త మందు క్యాన్సర్ కణాల్లో అధికంగా ఉండే రియాక్టీవ్ ఆక్సిజన్ స్పెసీస్‌‌‌‌ను గుర్తించి అక్కడే యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఎన్బీడీహెచ్ఈ ఎక్స్ అనే యాంటీ క్యాన్సర్ సమ్మేళనాన్ని విడుదల చేసి.. క్యాన్సర్ కణాల మనుగడకు సహాయపడే ప్రోటీన్లను అడ్డుకుంటుంది. 

దూకుడుగా ఉండే ట్రిపుల్ -నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపై నిర్వహించిన ప్రీ-క్లినికల్ పరీక్షల్లో ఈ మందు మంచి ఫలితాలను ఇచ్చింది. ఆరోగ్యకరమైన కణాలపై ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే, సైడ్ ఎఫెక్ట్స్ కూడా గణనీయంగా తగ్గినట్టుగా తేలింది. ఈ పరిశోధనను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అనుబంధ సంస్థ (ఆటోనామస్) అయిన ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌‌‌‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఏఎస్ఎస్‌‌‌‌టీ)కి చెందిన డాక్టర్ అసిస్ బాలా, ఐఐటీ గువాహటికి చెందిన డాక్టర్ కేపీ భబక్ నేతృత్వంలోని బృందం చేపట్టింది. అయితే, ఈ మందు ఇంకా మనుషులపై పరీక్షించే దశకు చేరలేదు. మరిన్ని అధ్యయనాలు, క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాతే దీని భద్రత, సమర్థతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.