నయారా బంకుల్లో ధరల పెంపు..ప్రభుత్వ బంకుల్లో మాత్రం అదే ధర

నయారా బంకుల్లో ధరల పెంపు..ప్రభుత్వ బంకుల్లో మాత్రం అదే ధర

పెట్రోల్​పై రూ.5, డీజిల్​పై రూ.3

న్యూఢిల్లీ: ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ లీటర్ పెట్రోల్‌‌‌‌పై రూ.5, డీజిల్‌‌‌‌పై రూ.3 చొప్పున ధర పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడిచమురు, రిఫైన్డ్ ఉత్పత్తుల ధరల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 7,108 పెట్రోల్ పంపులు నిర్వహిస్తున్న ఈ సంస్థ శనివారం ఉదయం నుంచే కొత్త ధరలను అమల్లోకి తెచ్చింది. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను వినియోగదారులకు బదిలీ చేసిన తొలి ప్రైవేట్ సంస్థగా నయారా నిలిచింది. 

అంతకుముందు మార్చిలో పెంచిన ధరలను జులై 1న తగ్గించినా, ఇప్పుడు మళ్లీ ధరలు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలోని 90శాతం బంకులను నియంత్రించే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఎల్ వంటి ప్రభుత్వ చమురు సంస్థలు  మాత్రం ధరలను మార్చడం లేదు. ప్రస్తుతం ఇవి లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.9 వరకు మార్కెటింగ్ నష్టాలను భరిస్తున్నట్లు ఇక్రా సంస్థ నివేదిక పేర్కొంది. ఎల్పీజీపైనా నష్టాలు వస్తున్నాయని వెల్లడించింది.