వికారాబాద్ జిల్లా : ఇద్దరు పిల్లలను బావిలోకి తోసింది.. ఆ తరువాత తల్లి ఏం చేసిందంటే..!

వికారాబాద్ జిల్లా : ఇద్దరు పిల్లలను బావిలోకి తోసింది.. ఆ తరువాత  తల్లి ఏం చేసిందంటే..!
  • మాటూగూడెం గ్రామంలో విషాద ఛాయలు

పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను వ్యవసాయ బావిలోకి తోసి తాను ఆత్మహత్య చేసుకుంది. చన్గోముల్ ఎస్సై భరత్ కుమార్ రెడ్డి వివరాల ప్రకారం.. పూడూరు మండలం మాటూగూడెం గ్రామానికి చెందిన ఉప్పరి రాజు, మమత (26) దంపతులకు ఇద్దరు పిల్లలు సాకేత్ (8), జనశ్రీ (4) ఉన్నారు. 

భార్యాభర్తల మధ్య శుక్రవారం గొడవ జరిగింది. దీంతో మమత పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం వరకు భర్త వారి కోసం బంధుమిత్రుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పరిగి, పూడూరు పోలీస్ స్టేషన్లలో భార్య, పిల్లలు కనిపించడం లేదని రాజు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం సోమన్‌‌గుర్తి గ్రామంలోని ఓ వ్యవసాయ బావి దగ్గర గొర్లకాపరులకు మహిళ చెప్పులు కనిపించడంతో వెళ్లి చూడగా, నీటిలో మృతదేహం కనిపించింది.

 వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మొదట మమత, జనశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లతో గంటలపాటు శ్రమించి సాకేత్ మృతదేహాన్ని కూడా వెలికితీశారు. అనంతరం మృతదేహాలకు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.