బకాయిలు కట్టని మిల్లర్ల ఆస్తులు సీజ్ ..మిల్లర్లపై ఆర్ఆర్ చట్టం అమలుకు ప్రత్యేక డ్రైవ్

బకాయిలు కట్టని మిల్లర్ల ఆస్తులు సీజ్ ..మిల్లర్లపై ఆర్ఆర్ చట్టం అమలుకు ప్రత్యేక డ్రైవ్
  • ముందుగా షోకాజ్ నోటీసు, స్పందించకపోతే ఆస్తులు సీజ్
  • న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఆఫీసర్లకు ట్రైనింగ్

హైదరాబాద్‌‌, వెలుగు : సీఎంఆర్‌‌ ఇవ్వకుండా బకాయి పడిన రైస్‌‌ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ సిద్ధమైంది. ఇందులో భాగంగా మిల్లర్లపై రెవెన్యూ రివకరీ (ఆర్ఆర్) చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సివిల్ సప్లై శాఖ కమిషనర్‌‌, ప్రభుత్వ ఎక్స్‌‌-అఫీషియో ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ ఎం. స్టీఫెన్‌‌ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. 

బకాయిల వసూలులో న్యాయపరమైన లోపాలు తలెత్తకుండా చూసుకునేలా సివిల్ సప్లై శాఖ ఆఫీసర్లకు ఈ నెల ఐదు నుంచి హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్‌‌హెచ్‌‌ఆర్‌‌డీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

ముందుగా షాకాజ్ నోటీసులు

ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మిల్లర్లు దారి మళ్లించినట్లు, గోదాముల్లో నిల్వలు తగ్గినట్లు తనిఖీల్లో గుర్తిస్తే ముందుగా షోకాజ్‌‌ నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు మిల్లర్లకు ఏడు రోజుల గడువు ఇవ్వనున్నారు. నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు చేపట్టనున్నారు. బకాయిల రికవరీలో భాగంగా రైస్‌‌ మిల్లులు, వాహనాలు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయనున్నారు. 

వీటి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం బకాయిలు రికవరీ కాకపోతే మిల్లర్లకు చెందిన భూములు, ఇండ్లు వంటి స్థిరాస్తులను సైతం సీజ్ చేసి బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ చర్యలన్నీ చట్టబద్ధంగా, ఆధారాలతో చేపట్టేలా ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్‌‌ సివిల్‌‌ సప్లై ఆఫీసర్లకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడం, పంచనామాలు నమోదు చేయడం, వీడియో ఆధారాలను సేకరించడం వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

 అలాగే అసిస్టెంట్‌‌ మేనేజర్లు, జిల్లా మేనేజర్లకు మిల్లర్ల బకాయిలను కచ్చితంగా లెక్కించడం, రికవరీ రికార్డుల నిర్వహణపై, జిల్లా సివిల్‌‌ సప్లై ఆఫీసర్లు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మిల్లర్ల ఆస్తులను గుర్తించి, తదుపరి చర్యలు చేపట్టే విధానంపై అవగాహన కల్పించనున్నారు.