గచ్చిబౌలి, వెలుగు: చీరల రిటైల్ సంస్థలో పని చేసే అకౌంటెంట్ ఫోన్‌కు సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్ పంపించి ఫోన్‌ను హ్యాక్ చేసి ఓనర్‌తో జరిగిన సంభాషణ అంతా విన్నారు. ఆ తరువాత ఓనర్ పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి యజమానిలా మెసేజ్ చేసి రూ.కోటి కొట్టేశారు. గంటలోపే ఫిర్యాదు అందుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే అకౌంట్ ను ఫ్రీజ్ చేసి యూపీలోని లక్నోకు చెందిన దీపక్‌ను అరెస్ట్ చేసి డబ్బులు రికవరీ చేశారు.
గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ లో సీపీ రమేశ్, సైబర్ క్రైమ్ డీసీపీ పుష్ప వివరాలు వెల్లడించారు. సైబరాబాద్‌లోని ఓ చీరల కంపెనీ అకౌంటెంట్ ఫోన్‌కు సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్ పంపించారు. ఫోన్ యాక్సెస్కావడంతో అకౌంటెంట్, ఓనర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ, చాటింగ్‌ను తెలుసుకున్నారు. ఆ తర్వాత ఓనర్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఓనర్ మాదిరిగానే అకౌంటెంట్‌తో చాటింగ్ చేశారు. ఈక్రమంలో గత నెల 14న ఓనర్ నుంచి అకౌంటెంట్‌కు రూ.కోటి పంపించాలని మెసేజ్ వచ్చింది.
ఓనర్ మెసేజ్ చేశాడని నమ్మిన అకౌంటెంట్ రూ.కోటి ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే తన ప్రమేయం లేకుండా అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావడంతో ఓనర్ అప్రమత్తమై అకౌంటెంట్‌కు ఫోన్ చేసి అడగడంతో విషయం బయటపడింది. దీంతో బాధితుడు గంటలోపే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే సదరు బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు.
కేసు దర్యాప్తులో యూపీలోని లక్నోకు చెందిన దీపక్‌కుమార్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించి, నిందితుడిని ఈ నెల ఈ నెల 8న అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై సైబరాబాద్‌కు తీసుకువచ్చి రిమాండ్‌కు పంపించారు. బుధవారం బాధితుడికి రూ.కోటి చెక్‌ను సీపీ అందజేశారు. ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మోహన్, ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు.
