హైదరాబాద్ లో రెచ్చిపోతున్న సైబర్ క్రిమినల్స్ .. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.31.61 లక్షలు స్వాహా

హైదరాబాద్ లో రెచ్చిపోతున్న సైబర్ క్రిమినల్స్ .. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.31.61 లక్షలు స్వాహా

గచ్చిబౌలి, వెలుగు: సీబీఐ అధికారులమని నమ్మించి డిజిటల్​ అరెస్ట్​ పేరుతో ఓ పాస్టర్​ నుంచి సైబర్​ నేరగాళ్లు రూ.31.61 లక్షలు కాజేశారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్​ రాఘవేంద్రకాలనీకి చెందిన పాస్టర్(73)కు గత నెల 24న ఓ వ్యక్తి ఫోన్​ చేసి తాను ముంబైలోని టెలికాం డిపార్ట్​మెంట్​ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ఓ మహిళను వేధించావని చెప్పి అసభ్యకరమైన ఫొటోలు పంపించాడు. 

తరువాత రోజు ఫోన్​ చేసి తాను సీబీఐ ఆఫీసర్​ను మాట్లాడుతున్నానని చెప్పి ముంబైలోని నరేశ్​​గోయల్​ అనే వ్యక్తి ఇంటిపై రైడ్​ చేస్తే 229 డెబిట్​​కార్డులు దొరికాయని, అందులో నీ కార్డు ఉందని పాస్టర్​కు చెప్పాడు. కెనరా బ్యాంక్  అకౌంట్​ నుంచి రూ.5లక్షలు మనీ ల్యాండరింగ్​ జరిగిందని భయభ్రాంతులకు గురి చేశాడు. విచారణ కోసం ముంబైలోని సీబీఐ ఆఫీస్​కు రావాలని సూచించాడు.​ 

అనారోగ్య కారణాలతో తాను రాలేనని చెప్పడంతో డిజిటల్​ వెరిఫికేషన్​ ద్వారా విచారణ చేస్తామని చెప్పి, బ్యాంక్​ అకౌంట్​లో ఉన్న డబ్బు బదిలీ చేయాలని, వెరిఫికేషన్​ పూర్తయ్యాక తిరిగి పంపిస్తామని నమ్మించారు. రసీదు కూడా ఇస్తామని చెప్పడంతో పాస్టర్​ తన బ్యాంక్​ అకౌంట్​లో ఉన్న రూ.31.61 లక్షలు సదరు వ్యక్తులు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్​ఫర్​ చేశాడు. ఆ తరువాత డబ్బులు  పంపకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించాడు.

ఏసీబీ రైడ్​ పేరుతో  ఆర్ అండ్ బీ ఈఈకి టోకరా..

ఏసీబీ అధికారి అని బెదిరించి ఆర్అండ్​బీ ఈఈ నుంచి సైబర్​ నేరస్తుడు రూ.10 లక్షలు కొట్టేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొంపల్లికి చెందిన ఈఈకి గత నెల 15న ఓ వ్యక్తి ఫోన్​ చేసి తాను ఏసీబీ ఆఫీస్​ నుంచి నరేందర్​రెడ్డి మాట్లాడుతున్నానని, అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదు వచ్చిందని రైడ్​ చేస్తారని భయభ్రాంతులకు గురి చేశాడు. 

రైడ్​ చేయకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు డబ్బు పంపించాలనడంతో సదరు అధికారి భయపడి తనతో పాటు తన ఫ్రెండ్స్​ అకౌంట్ల నుంచి జులై 15 నుంచి ఈ నెల 2 వరకు 25 సార్లు సైబర్​ నేరగాడు సూచించిన నంబర్లకు రూ.10 లక్షలు ట్రాన్స్​ఫర్​ చేశాడు. మరింత డబ్బు పంపాలని డిమాండ్​ చేయడంతో బాధితుడు సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.