టూరిజం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్..ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : ఏఐటీయూసీ

టూరిజం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్..ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : ఏఐటీయూసీ
  • మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఏఐటీయూసీ నేతల వినతి 

హైదరాబాద్, వెలుగు: టూరిజం డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌లో 23 ఏండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ టూరిజం ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రవీంద్రభారతిలో వారు మంత్రి జూపల్లి కృష్ణారావును  కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టూరిజం కార్పొరేషన్‌‌లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను బేషరతుగా క్రమబద్ధీకరించాలని కోరారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 61 ఏండ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా ఏజెన్సీ, డైలీ వేజ్, టూరిజం ప్లాజా ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్న తెలంగాణ ఇంక్రిమెంట్‌‌ను వెంటనే మంజూరు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌‌సోర్సింగ్ కార్మికులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని నేతలు కోరారు. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో  ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ, టూరిజం ఉద్యోగులు రమేశ్, రాజన్న, విష్ణు, శ్రీను, తిరుపతి, అజయ్, శ్యామ్, సమ్మయ్య, మౌలాలి, బల్వీర్ పాల్గొన్నారు.