పోక్సో కేసులో నిందితుడికి చిత్రహింసలు?... రాయదుర్గం పోలీసులకు కోర్టు నోటీసులు

పోక్సో కేసులో నిందితుడికి చిత్రహింసలు?... రాయదుర్గం పోలీసులకు కోర్టు నోటీసులు

గండిపేట, వెలుగు: పోక్సో కేసులో అరెస్టైన ఓ నిందితుడిని పోలీసులు విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నిందితుడిని రిమాండ్‌‌కు తరలించే సమయంలో అతడి శరీరంపై ఉన్న గాయాలను లాయర్​ రాజేంద్రనగర్  కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు నిందితుడిని విడుదల చేయాలని ఆదేశించడంతో పాటు రాయదుర్గం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 

పోక్సో కేసులో రాయదుర్గం పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. అయితే రిమాండ్  సమయంలో నిందితుడి శరీరంపై గాయాలు ఉన్న విషయాన్ని అతడి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనే గాయాలయ్యాయని న్యాయవాది వాదించగా, రాజేంద్రనగర్ కోర్టు నిందితుడిని విడుదల చేయాలని ఆదేశించినట్లు సమాచారం. నిందితుడికి గాయాలు ఎలా అయ్యాయన్న అంశంపై రాయదుర్గం పోలీసుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.