- ‘జీత్ విన్’ యాప్ ప్రమోషన్‌పై వివరాలు సేకరించిన ఈడీ
- ఇప్పటికే 29 మంది సెలబ్రిటీలను ప్రశ్నించిన ఈడీ, సీఐడీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం ఉన్న విషయం తనకు తెలియదని నటి నిధి అగర్వాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ కంపెనీలతో ఒప్పందాలు, రెమ్యూనరేషన్, బ్యాంక్ స్టేట్‌మెంట్లను ఈడీకి అందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఆమె బుధవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం10.30 గంటలకు బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మహిళా అధికారి సహా ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ బృందం మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించింది.
ప్రమోషన్ వీడియోలు ముందుపెట్టి ప్రశ్నలు..
‘జీత్ విన్’ సహా మరికొన్ని బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లను నిధి అగర్వాల్ ప్రమోట్ చేసినట్లు ఈడీ అధికారులు ఆమెకు ఆధారాలు చూపారు. కాగా, రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం ఉన్న సంగతి తనకు తెలియదని నిధి అగర్వాల్ చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయా యాప్స్‌లో జరిగిన మనీలాండరింగ్, ఆన్‌లైన్ లావాదేవీలను నిధి అగర్వాల్ ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే ఆయా యాప్స్‌కు సంబంధించి రెమ్యునరేషన్, స్పాన్సర్‌షిప్‌లపై వివరాలను ఈడీ అధికారులు సేకరించారు.
బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి నిధి అగర్వాల్ అకౌంట్లలోకి డిపాజిట్ అయిన లావాదేవీల వివరాలను పరిశీలించారు. కాగా, హవాలా రూపంలోనూ డబ్బులు చేతులు మారిన విషయమై ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలో నగదు రూపంలో తీసుకున్న డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిసింది.
మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు
గతేడాది హైదరాబాద్, సైబరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన బెట్టింగ్ యాప్స్‌పై ఇప్పటికే సీఐడీ సిట్ విచారణ జరుపుతున్నది. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది.ఈ కేసులో 29 మంది సెలబ్రిటీలను ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఈడీ గుర్తించింది. వీరిలో ఇప్పటికే రానా దగ్గుపాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, అనన్య నాగళ్లతో పాటు14 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నించింది. ఈడీతో పాటు సీఐడీ సిట్ కూడా వారి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసింది. సీఐడీ కూడా నిధి అగర్వాల్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది.
