- వేలం వడ్ల పైసలూ కడ్తలే! 2022–23 యాసంగిలో వేలం వేసిన ధాన్యాన్ని మాయం చేసిన మిల్లర్లు
- 22.07 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.4,497 కోట్లు వసూలు
- ఇంకా 15.94 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.3,572 కోట్లు పెండింగ్
- 20 మిల్లుల నుంచే రూ.750 కోట్ల బకాయిలు!
- దాడులు, పీడీయాక్ట్‌లు, కేసులతో ఒత్తిడి పెంచుతున్న సర్కారు
- ఉక్కిరిబిక్కిరవుతున్న మిల్లర్లు
హైదరాబాద్, వెలుగు: 2022–23 యాసంగి సీజన్‌లో ప్రభుత్వం వేలం వేసిన ధాన్యాన్ని మాయం చేసిన మిల్లర్లు సివిల్సప్లైశాఖకు వేల కోట్లు పెండింగ్పెట్టారు. టెండర్లలో ధాన్యం దక్కించుకున్న కంపెనీలకుగానీ, సర్కారుకుగానీ బియ్యం ఇవ్వకుండా, బకాయిలు కట్టకుండా ముప్పుతిప్పలు పెడ్తున్నారు. ఆయా మిల్లర్ల నుంచి నిర్ణీత గడువులో ధాన్యాన్ని, దానికి సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయడంలో కంపెనీలు విఫలం కావడంతో స్వయంగా సర్కారు రంగంలోకి దిగింది.
ఆఫీసర్ల ద్వారా ఒత్తిడి పెంచడంతో ఇప్పటివరకూ 22.07 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.4,497 కోట్లు వసూలు కాగా.. ఇంకా 15.94 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.3,572 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా 20 మిల్లులు ఏకంగా రూ.752 కోట్లకుపైగా బకాయి పడినట్టు అధికారులు తేల్చారు. అత్యధికంగా నల్గొండలోని ఓ మిల్లులో 31,838 టన్నుల ధాన్యం మాయం కాగా.. రూ.71.22 కోట్ల మేర పెండింగ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
38 లక్షల టన్నుల ధాన్యం వేలం..
2022–23 యాసంగి సీజన్‌లో రైతుల నుంచి సివిల్ సప్లయ్స్ శాఖ 66.84 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, మిల్లర్లకు అప్పగించింది. ఇందులో 38 లక్షల టన్నుల ధాన్యాన్ని 2024 జనవరి 25న వేలం పాట ద్వారా 26 కంపెనీలకు కట్టబెట్టింది. ఆయా కంపెనీలు మిల్లర్ల నుంచి ధాన్యాన్ని తీసుకొని ప్రభుత్వానికి రూ.8,069 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా, టెండర్ల ద్వారా సేకరించిన ధాన్యం మిల్లుల్లోనే ఉన్నందున బకాయిలు చెల్లించలేకపోతున్నామని ఆయా కంపెనీలు మభ్యపెడ్తూ వచ్చాయి. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టగా.. చాలా మిల్లుల్లో ధాన్యం లేని విషయం బయటపడింది.
చేతులెత్తేసిన టెండర్ కంపెనీలు
రైతుల నుంచి సేకరించిన ధాన్యం 1,572 రైస్‌మిల్లుల్లో ఉండిపోయింది. ఆయా మిల్లర్ల నుంచి నిర్ణీత గడువులో ధాన్యాన్ని, దానికి సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయడంలో టెండర్ దక్కించుకున్న కంపెనీలు విఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ధాన్యానికి క్వింటాల్‌కు ధర నిర్ణయించింది. ఆ రేటు ప్రకారం మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. అధికారుల చర్యల వల్ల ఇప్పటివరకూ 22.07 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.4,497 కోట్లు మిల్లర్ల నుంచి వసూలయ్యాయి. ఇంకా 15.94 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.3,572 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా మరోసారి గడువును ఆగస్టు 5కు పొడిగించింది.
పీడీ యాక్టులు, కేసులతో మిల్లర్లపై ఒత్తిడి..
2022–23 వేలం వడ్ల బకాయిల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంతో పాటు అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. దీంతో వేలం వేసిన ధాన్యం ఎక్కడ, ఎవరి వద్ద, ఎంత మొత్తంలో ఉంది? అనే వివరాలను అధికారులు సేకరించారు. 20 మిల్లుల వద్దే ఏకంగా రూ.752 కోట్ల విలువైన 3.30 లక్షల టన్నుల ధాన్యం మాయమైనట్టు గుర్తించారు.
సర్కార్‌కు బకాయి ఉన్న టాప్ 20 మిల్లులు ఇవే..
జిల్లా మిల్లు పేరు బకాయి ధాన్యం(టన్నుల్లో) విలువ (రూ. కోట్లలో)
1. నల్గొండ రామ్‌లక్ష్మణ్ పారాబాయిల్డ్ రైస్ ప్రైవేట్ లిమిటెడ్ 31,838.130 71.22
2. సూర్యాపేట రఘురామ్ ఇండస్ట్రీస్, ప్రగతినగర్, తిరుమలగిరి 27,868.455 68.05
3. సూర్యాపేట సంతోష్ రైస్ ఇండస్ట్రీస్, తొండ, తిరుమలగిరి 27,122.555 60.67
4. సూర్యాపేట శ్రీ సంతోషిమా పీబీఆర్‌ఎం 21,815.820 53.27
5. ఖమ్మం ఎస్‌ఏఆర్ రైస్ ప్రొడక్ట్స్, గుండ్రాతిమడుగు 17,277.621 38.65
6. కరీంనగర్ శ్రీ సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీరాములపల్లి 16,864.630 37.72
7. సూర్యాపేట తిరుమల రైస్ కార్పొరేషన్, దిర్శించెర్ల 14,928.200 36.45
8. నల్గొండ గౌతమి పీబీఆర్‌ఐ 16,040.823 35.88
9. సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కొమరబండ, కోదాడ 15,237.380 34.08
10. వనపర్తి ఎంఎస్ అల్ అజీజ్ అగ్రో ఇండస్ట్రీస్ 15,226.877 34.06
11. వనపర్తి ఎంఎస్ శ్రీ మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ 14,030.364 31.38
12. నల్గొండ చాముండేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 13,970.872 31.25
13. వనపర్తి రిలిక్ ఆగ్రో ఫామ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 14,127.676 31.60
14. మహబూబ్‌నగర్ ఎంఎస్ శ్రీ కనకదుర్గ పీబీ రైస్ మిల్ 12,789.103 28.61
15. కరీంనగర్ మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్, కోరపల్లి 12,377.319 27.69
16. నల్గొండ సుమాంజలి పారాబాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 12,285.679 27.48
17. జగిత్యాల ఏఆర్‌ఎస్ మంగ్లీ ఆగ్రో ఇండస్ట్రీస్, మొగిలిపేట 12,194.355 27.28
18. జగిత్యాల శ్రీ అభయాంజనేయ సాయి ఇండస్ట్రీస్, తక్కళ్లపల్లి 11,404.586 25.51
19. వికారాబాద్ శ్రీ వెంకట రమణ రైస్ ఇండస్ట్రీస్ 11,260.150 25.19
20. సూర్యాపేట వజ్ర వికాస్ రైస్ మార్ట్ 11,658.458 26.08
మొత్తం 3,30,319.053 752.120
