- మనవ్ సుతార్ స్పిన్ మాయ.. మ్యాచ్‌లో 10 వికెట్లు
- రెండో ఇన్నింగ్స్‌లో 6/55.. ఆరు బాల్స్‌లో మూడు వికెట్లు
- రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1–0 ఆధిక్యం
చారిత్రక 600వ టెస్టును టీమిండియా ఘన విజయంతో ముగించింది. మానవ్ సుతార్ స్పిన్ మాయకు శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేయడంతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గాలె: చారిత్రక 600వ టెస్టును టీమిండియా ఘన విజయంతో చిరస్మరణీయం చేసుకుంది. యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ మనవ్ సుతార్ స్పిన్ మాయకు శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేయడంతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చివరి రోజు 84/4తో ఆట ప్రారంభించిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సేన 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన సుతార్.. మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లతో భారత్ విజయంలో హీరోగా నిలిచాడు.
దినుషా, డిసిల్వా పోరాటం
చివరి రోజు మరో 288 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓవర్‌నైట్ బ్యాటర్లు సోనల్ దినుషా, కెప్టెన్ ధనంజయ డిసిల్వా అండగా నిలిచారు. భారత బౌలర్లను పట్టుదలగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఐదో వికెట్‌కు 202 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు స్వీప్ షాట్లను ఎక్కువగా ఉపయోగిస్తూ తొలి సెషన్‌లో గంటకు పైగా భారత్‌కు వికెట్ దక్కకుండా అడ్డుకున్నారు. డిసిల్వా 125 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు 151 బంతుల్లో 59 పరుగులు చేసిన అతడిని రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపాడు. జడేజా వేసిన బంతిని స్వీప్ చేసేందుకు ప్రయత్నించిన డిసిల్వా టాప్ ఎడ్జ్ ఇవ్వగా షార్ట్ ఫైన్‌లెగ్‌లో సుతార్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కీలక భాగస్వామ్యానికి తెరపడింది.
సుతార్ వచ్చాక మారిన కథ
లంచ్ సమయానికి శ్రీలంక 175/6తో నిలవగా.. రెండో సెషన్‌లో దినుషా పోరాటం కొనసాగించాడు. స్కోరు 199కు చేరడంతో లంక మ్యాచ్‌ను మరికొంతసేపు సాగించేలా కనిపించింది. అయితే కెప్టెన్ గిల్.. సుతార్‌ను తిరిగి బౌలింగ్‌కు తీసుకురావడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. 76వ ఓవర్‌లో సుతార్ ఆరు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంకను 199/9కి నెట్టాడు. సెంచరీ దిశగా సాగుతున్న దినుషా (84)తో పాటు ప్రభాత్ జయసూర్య, లహిరు కుమారను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం కేశర నువంతను బౌల్డ్ చేసి లంక ఇన్నింగ్స్‌కు తెరదించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సుతార్ 55 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
వరుసగా రెండోసారి ఐదు వికెట్లు
సుతార్‌కు ఇది వరుసగా రెండో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో తన అరంగేట్ర టెస్టులోనూ ఐదు వికెట్ల ఘనత సాధించిన అతడు.. గాలెలో మరోసారి సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన సుతార్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగి మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్ల ఘనత అందుకున్నాడు. స్పిన్‌కు అనుకూలించే గాలె పిచ్‌పై యువ స్పిన్నర్ చూపిన ప్రదర్శన భారత్‌కు కీలక విజయాన్ని అందించింది.
డిక్వెల్లాను పంపిన ప్రసిద్ధ్
డిసిల్వా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన నిరోషన్ డిక్వెల్లా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. కుల్దీప్ యాదవ్, జడేజా బౌలింగ్‌లో భారీ షాట్లకు ప్రయత్నించిన అతడు చివరకు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కవర్స్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతుల్లోకి వెళ్లింది.
వర్షానికి ముందే విక్టరీ
భారత్ విజయం సాధించిన ఐదు నిమిషాలకే గాలెలో భారీ వర్షం కురవడం విశేషం. సుతార్ చివరి వికెట్‌ను పడగొట్టి మ్యాచ్‌ను ముగించడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు భారత శిబిరం ఊపిరిపీల్చుకుంది. మ్యాచ్ మరికొంతసేపు కొనసాగి ఉంటే వర్షం కారణంగా ఫలితంపై ప్రభావం పడే అవకాశం ఉండేది.స్పిన్‌కు పెట్టింది పేరైన గాలె వేదికపై సాధించిన ఈ విజయం భారత్‌కు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో స్పిన్ అనుకూల పిచ్‌లపై ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఈ గెలుపు టీమిండియాకు కీలకంగా మారింది. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1–0 ఆధిక్యంలో నిలవగా.. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ప్రారంభం కానుంది.
