- పెద్ద సైన్ బోర్డుల ఏర్పాటు
- మైక్‌లతో లైన్ చేంజ్ వద్ద అనౌన్స్ మెంట్స్
- ఈజీగా మారిన జర్నీ
హైదరాబాద్ సిటీ, వెలుగు : కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేస్తున్న వన్-వే ట్రాఫిక్ విధానం రెండో రోజు సెట్అయ్యింది. మొదటి రోజు వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు, ఆఫీసర్లు కొన్ని పరిష్కారాలు చూపించారు. తొలి రోజు వాహనదారులు కొత్త రూట్లపై అవగాహన లేక గందరగోళానికి గురి కాగా, బుధవారం ఆ పరిస్థితి రిపీట్‌కాలేదు. మంగళవారం చిన్న సైన్‌బోర్డులు తమకు కనిపించడం లేదని వాహనదారులు కంప్లయింట్చేయగా, బుధవారం వాటిని మార్చి పెద్ద సైజులో సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే, కొంతమంది లైన్ఛేంజ్అయ్యే దగ్గర కన్ఫ్యూజ్అవుతున్నారని గుర్తించిన పోలీసులు మైక్‌లతో బాక్సులు పెట్టి అనౌన్స్‌మెంట్‌లు చేశారు. ముఖ్యంగా ఏ లైన్లో వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి ఈ అనౌన్స్‌మెంట్లు ఉపయోగపడుతున్నాయి.
రెండో రోజు ఎలా సాగిందంటే..
మొదటి రోజుతో పోలిస్తే బుధవారం ట్రాఫిక్ చాలా సాఫీగా సాగిపోయింది. ఎగ్జిట్పాయింట్ల నుంచి వెళ్లాలనుకునేవారు లెఫ్ట్‌సైడ్, స్ట్రెయిట్‌గా వెళ్లాలనుకునే వారు రైట్సైడ్నుంచి వెళ్లడంతో ట్రాఫిక్ జామ్ సమస్య చాలా వరకు తగ్గింది. అయితే, బాలకృష్ణ ఇంటి దగ్గర ఇంతకుముందు యూ టర్న్కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. దీంతో పొరపాటున లెఫ్ట్సైడ్వెళ్లిన వాహనదారులు అక్కడికి వచ్చి మళ్లీ లెఫ్ట్టర్న్తీసుకుని దుర్గం చెరువు వెళ్లే ఫ్లై ఓవర్కింది నుంచి యూటర్న్తీసుకుని రిటర్న్రావలసి వస్తున్నది. దీంతో అక్కడ కాస్త రద్దీ కనిపిస్తోంది. అయితే, మైండ్ స్పేస్ కు వెళ్లే దారిలో ప్లై ఓవర్ కింద నుంచి వచ్చే సమయంలో మరో రెండు మార్గాల్లో జూబ్లీ చెక్ పోస్టుకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. హీరో శ్రీహరి ఇల్లు ఉండే వీధి నుంచి, దాని పక్కనే ఉండే మరో వీధి నుంచి కూడా డైవర్షన్ ఇచ్చారు.
అడుగడుగునా పోలీసుల అవగాహన
వన్ వే విధానంలో 13 ఎగ్జిట్ పాయింట్స్, 10 లైన్ ఛేంజర్లు పెట్టగా, వీటి దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులు ఉండి వాహనదారులకు అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. ఎవరికైనా ఎటు వెళ్లాలో తెలియక ఆగితే అర్థమయ్యేలా చెప్తున్నారు. షిఫ్టుకు 250 మంది ట్రాఫిక్, సివిల్‌పోలీసులు, ఆఫీసర్లు ఉండి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా డ్యూటీలు చేస్తున్నారు. దీంతో మంగళవారంతో పోలిస్తే బుధవారం 90 శాతం పరిస్థితి చక్కబడింది. అలాగే, ప్రయాణ సమయం కూడా తగ్గిందని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కేబీఆర్ పార్క్ చుట్టూ తిరగడానికి గంట నుంచి గంటన్నర పట్టగా బుధవారం 20 నుంచి 25 నిమిషాలే పట్టింది.
