- చెరువుల ఇన్‌లెట్లు, ఔట్‌లెట్ల అభివృద్ధిపై పొగడ్తలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైద్రాబాద్ లో హైడ్రా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులను జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ ప్రశంసించింది. చెరువుల సహజ లక్షణాలను పరిరక్షిస్తూ క్యాచ్‌మెంట్ ప్రాంతం నుంచి వరద నీరు చేరేలా ఇన్‌లెట్లు, చెరువు నిండిన తర్వాత నీటిని దిగువకు పంపేలా ఔట్‌లెట్లను అభివృద్ధి చేయడం, పటిష్టమైన బండ్‌ల నిర్మాణం వంటి చర్యలు అభినందనీయమని పేర్కొంది. హైడ్రా చేపడుతున్న చెరువుల అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడింది. ఢిల్లీకి చెందిన జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ శైలేష్‌కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలోని సభ్యులు ఇరిగేషనర్ అధికారులతో కలిసి బుధవారం ఫాక్స్‌సాగర్ లేక్ ను సందర్శించారు.
సరస్సు ప్రధాన కట్టను పరిశీలించి.. ప్రస్తుత పరిస్థితి, కట్ట భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. ఫాక్స్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధి 482.6 ఎకరాలు కాగా, లేక్ పరిరక్షణ, పునరుద్ధరణకు సంబంధించి హైడ్రా రూపొందించిన ప్రణాళికను విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ యూనస్ వివరించారు. సరిహద్దుల పరిరక్షణ, ఆస్తుల రక్షణ, పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ అభివృద్ధి చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు. హైడ్రా ఫేజ్–-3లో పెద్ద చెరువుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఫాక్స్‌సాగర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, సంరక్షణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని కాపాడటం, పరిసర ప్రాంతాలను పరిరక్షించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. చెరువులతోపాటు ప్రజల ఆస్తుల పరిరక్షణకు హైడ్రా చేపడుతున్న చర్యలను కూడా జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ సభ్యులు అభినందించారు.
