- రూ.16 లక్షల విలువైన ఎండీఎంఏ, ఓజీ కుష్ స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లతో పాటు నగరానికి చెందిన ఓ పెడ్లర్‌ను, 16 మంది వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.16.40 లక్షల విలువైన 95 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో మీడియాకు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్, ఎస్వోటీ డీసీపీ శోభన్‌బాబు వివరాలు వెల్లడించారు.
ఈ నెల 11న వట్టినాగుపల్లి కింగ్డమ్ పబ్ సమీపంలో డ్రగ్స్ అమ్ముతున్న మూసాపేట్ జేపీనగర్‌కు చెందిన కె. యశ్వంత్ సాయి షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. 2025లో గంజాయి సప్లై చేస్తూ బాలానగర్ ఎక్సైజ్ పోలీసులకు చిక్కిన సాయి షణ్ముఖ్ జైలులో సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి ద్వారా బెంగళూరులో డ్రగ్స్ సప్లై చేసే మహమ్మద్ రజెల్, నైజీరియాకు చెందిన సామ్ ఫోన్ నంబర్లు తీసుకున్నాడు.
జైలు నుంచి బయటకు వచ్చాక వారి వద్ద డ్రగ్స్ కొని హైదరాబాద్‌లో అమ్మడం ప్రారంభించాడు. యశ్వంత్ ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ సప్లై చేస్తున్న రజెల్, అతని ప్రియురాలు నవీనను అరెస్ట్ చేశారు. వీరితో పాటు 16 మంది డ్రగ్స్ వినియోగదారులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఎస్వోటీ ఏడీసీపీ గోవర్ధన్, గచ్చిబౌలి డీఐ నరేశ్ పాల్గొన్నారు.
