మేడ్చల్, వెలుగు: పాలిటెక్నిక్ విద్యను ఐటీఐ, స్కిల్ యూనివర్సిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి స్కీమ్’కు సంబంధించిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి మేడ్చల్ బస్ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఇతర సంస్థల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
సికింద్రాబాద్లో..
పద్మారావునగర్: ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల ఉపాధి అవకాశాలు, హక్కులు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
