- ఇంటర్ బోర్డు ఆఫీస్‌లో మాజీ సెక్రటరీ అశోక్‌ను విచారించిన అధికారులు
- 2019 ఫలితాల గందరగోళంపై లోతుగా ఆరా
- 23 మంది స్టూడెంట్ల చావులకు బాధ్యులెవరు?
- టెండర్లు, సాఫ్ట్‌వేర్ లోపాలపై డేటా సేకరణ.. రికార్డులు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ హయాంలో 2019 ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన గందరగోళం, ఆ తర్వాత విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డేటా ప్రాసెసింగ్ సంస్థ గ్లోబరీనాపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేపట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వారం రోజుల కిందట రంగంలోకి దిగిన అధికారులు.. బుధవారం ఇంటర్ బోర్డు మాజీ సెక్రటరీ అశోక్‌కుమార్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఫలితాల గందరగోళానికి కారణమైన సాఫ్ట్‌వేర్, టెండర్ల కేటాయింపులో జరిగిన పరిణామాలపై ఆరా తీశారు.
టెండర్ ఎలా ఇచ్చారు?..
గ్లోబరీనాకు టెండర్ ఎలా ఇచ్చారు? సాంకేతిక సామర్థ్యం సరిపోకపోయినా ఆ సంస్థకే కాంట్రాక్ట్ ఎందుకు అప్పగించారు? అనే కోణంలో విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో అప్పటి ఫైళ్లను పరిశీలించారు. నాటి బోర్డు సెక్రటరీ అశోక్‌కుమార్‌ను పిలిచి వివరణ కోరారు. ఆయన అప్పటి రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది. కొన్ని ఫైళ్ల జిరాక్స్ కాపీలు కావాలని అశోక్ కోరగా.. ప్రస్తుత సెక్రటరీ అభిలాష అభినవ్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇంటర్ బోర్డుతో పాటు గ్లోబరీనా సంస్థ కార్యాలయం నుంచి కూడా పలు కీలక రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
23 మంది విద్యార్థుల మృతిపై ఆరా..
2019లో ఇంటర్ ఫలితాల డేటా ప్రాసెసింగ్‌లో గ్లోబరీనా సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు తలెత్తడంతో వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ గందరగోళంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు జరిగాయి. ఆ సమయంలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపైనా విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంత పెద్ద వివాదం జరిగినా అప్పటి ప్రభుత్వం గ్లోబరీనాను బ్లాక్‌లిస్ట్‌లో ఎందుకు పెట్టలేదనే అంశంపైనా విచారణ చేస్తున్నారు.
సంస్థకు టెండర్ కట్టబెట్టే సమయంలో నిబంధనలు పాటించారా? సాఫ్ట్‌వేర్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. గ్లోబరీనా వ్యవహారంలో అప్పటి ఇంటర్ బోర్డు అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. టెండర్ ఫైళ్లు, సాఫ్ట్‌వేర్ వివరాలను పరిశీలించి బాధ్యులను గుర్తించే పనిలో ఉన్నారు. అశోక్‌కుమార్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, అశోక్‌కుమార్‌ను గురువారం కూడా మరోసారి విచారించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
