మహాలక్ష్మికి పెరుగుతున్న ఆదరణ.. 3 నెలల్లో 35 కోట్ల 65 లక్షల మంది జర్నీ

మహాలక్ష్మికి పెరుగుతున్న ఆదరణ.. 3 నెలల్లో 35 కోట్ల 65 లక్షల మంది జర్నీ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మహిళల నుంచి ఆదరణ కొనసాగుతోంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ రవాణా సదుపాయాలను విస్తరిస్తూ, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో అదనపు ట్రిప్పులు నడుపుతోంది.

2025తో పోలిస్తే 2026లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.2025 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 3,467.91 లక్షల (34.67 కోట్లు) మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. 2026లో ఇదే కాలానికి ఆ సంఖ్య 3,565.11 లక్షలకు (35.65 కోట్లు) చేరింది.

దీంతో గత ఏడాదితో పోలిస్తే కేవలం మూడు నెలల్లోనే 97.20 లక్షల మంది అదనపు మహిళా ప్రయాణికులు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు.

రద్దీకి అనుగుణంగా బస్సులు, ట్రిప్పుల పెంపు

మహాలక్ష్మి పథకం కారణంగా మహిళా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ప్రధాన రూట్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ప్రయాణికుల రద్దీని నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన ప్రాంతాల్లో బస్సుల సంఖ్యతో పాటు ట్రిప్పులను పెంచుతోంది.మహిళలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు రూట్ల వారీగా రవాణా అవసరాలను అంచనా వేసి చర్యలు చేపడుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.మహాలక్ష్మి పథకం ద్వారా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రవాణా సదుపాయాలను మరింత విస్తరించడంపై టీజీఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది.