ఇండియా, వెస్టిండీస్‎కు బిగ్ షాక్.. రెండు జట్లకు ఐసీసీ భారీ జరిమానా

ఇండియా, వెస్టిండీస్‎కు బిగ్ షాక్.. రెండు జట్లకు ఐసీసీ భారీ జరిమానా

న్యూఢిల్లీ: ఇండియా, వెస్టిండీస్ జట్లకు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‎లో భాగంగా న్యూచంఢీగడ్ వేదికగా జరిగిన చివరిదైనా మూడో వన్డేలో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా ఇరుజట్లకు ఐసీసీ జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇండియాకు 20 శాతం, వెస్టిండీస్‎కు 10 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. 

ఈ మ్యాచులో భారత్, వెస్టిండీస్ ఇరుజట్లు నిర్ణీత సమయంలోగా బౌలింగ్ కోటాను పూర్తి చేయలేదని ఆన్-ఫీల్డ్ అంపైర్లు జయరామన్ మదనగోపాల్, సామ్ నోగాజ్స్కీ, థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా, ఫోర్త్ అంపైర్ వీరేందర్ శర్మ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఇద్దరూ తమ తప్పును అంగీకరించారు. దీంతో ఎలాంటి అధికారిక విచారణ లేకుండానే మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్ జరిమానా విధించారు. 

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వేసే ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం చొప్పున పెనాల్టీ విధిస్తారు. భారత్ నాలుగు ఓవర్లు, వెస్టిండీస్ రెండు ఓవర్లు ఆలస్యంగా వేసినట్లు తేలింది. దీంతో గిల్ సేనకు 20 శాతం, వెస్టిండీస్‎ ఆటగాళ్లకు 10 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది.

వన్డే సిరీస్ ఇండియా వశం..!

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‎ను టీమిండియా 2-1 తేడాతో దక్కించుకుంది. సిరీస్‌లోని తొలి రెండు వన్డేలను గెలిచిన భారత్ మూడవ వన్డేలో ఓటమి పాలైంది. న్యూ చండీగఢ్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో పర్యాటక జట్టు విజయం సాధించింది. కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ సాధించిన ఇండియా ఓటమి పాలైంది.