చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. నీమ్ కరోలీ బాబా ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. తాజా బాక్సాఫీస్ రిపోర్టుల ప్రకారం సినిమా 9వ వారంలోనూ తన జోరును కొనసాగిస్తోంది. ఇవాళ అక్టోబర్ 5 నాటికి వరల్డ్‌వైడ్ గ్రాస్ సుమారు రూ.423 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే హిందీలో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ సినిమా శుక్రవారం అక్టోబర్ 9న తెలుగు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తల్లి మరణం తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న లక్ష్మీనారాయణ్.. ఆ తర్వాత నీమ్ కరోలీ బాబాగా ఎలా ఎదిగారనే కథను ఈ చిత్రంలో చూపించారు.
