హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం వాడీవేడిగా సాగింది. పార్టీ నిధుల వినియోగంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల కో -ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీకి సంబంధించిన డబ్బును కొందరు నేతలు సక్రమంగా వినియోగించలేదని ఆయన ప్రశ్నించారని సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు పార్టీ తరఫున ఇవ్వాల్సిన మొత్తం డబ్బు అందలేదని అభయ్ పాటిల్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పార్టీ నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.
డబ్బులు దుర్వినియోగం చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని కూడా అభయ్ పాటిల్ హెచ్చరించినట్లు సమాచారం. “ఎవరెవరి వెనుక ఎవరున్నారో తెలుసు.. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు” అని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే పార్టీ నిధుల దుర్వినియోగానికి సంబంధించి అభయ్ పాటిల్ చేసినట్లు పేర్కొంటున్న ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
అభయ్ పాటిల్ పదాధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై మరింత దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.క్రియాశీల సభ్యత్వం లేని కొందరికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఎలా ఇచ్చారంటూ అభయ్ పాటిల్ ప్రశ్నించారు. ఇకపై మేనేజ్ చేసుకుని పార్టీ పదవులు పొందడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పదవులు పొందిన నేతలు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.
పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉన్న నేతలు హైదరాబాద్‌కే పరిమితం కావడంపై అభయ్ పాటిల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముగ్గురు నేతలు మినహా మిగతా వారంతా పార్టీ హెడ్‌క్వార్టర్‌లోనే ఉంటున్నారంటూ ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని, పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యక్రమాలను జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల స్థాయిలో నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ గతంలోనూ బూత్ స్థాయి సంస్థాగత నిర్మాణం, క్షేత్రస్థాయి బలోపేతంపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించింది.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయడం, బాధ్యతలు చేపట్టిన నేతలు క్రియాశీలంగా పనిచేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
