వెలుగు ఓపెన్ పేజీ.. ఆధునిక భారత్‌‌‌‌‌‌‌‌కు బాటలు వేసిన రాజీవ్ గాంధీ

వెలుగు ఓపెన్ పేజీ.. ఆధునిక భారత్‌‌‌‌‌‌‌‌కు  బాటలు వేసిన రాజీవ్ గాంధీ

భారతదేశాన్ని ఆధునిక 21వ శతాబ్దిలోకి  తీసుకెళ్లాలన్న దూరదృష్టితో  కృషిచేసిన మాజీ  ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని స్మరించుకోవడం అంటే ఆధునిక భారత నిర్మాణానికి ఆయన వేసిన పునాదులను గుర్తు చేసుకోవడమే. 40 ఏళ్ల వయసులోనే  దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన సాంకేతికత,  టెలికమ్యూనికేషన్స్, విద్య, యువత, గ్రామీణాభివృద్ధి, పరిపాలన, ఎన్నికల వ్యవస్థ, ఆర్థిక రంగాల్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.   ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ దురదృష్టవశాత్తు 1984లో  హత్యకు గురవడంతో  దేశం తీవ్రమైన విషాద పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీకి ప్రజలు అపూర్వమైన మద్దతిచ్చారు.

నేడు మాజీ ప్రధాని రాజీవ్‌‌గాంధీ జయంతి

1984 లోక్‌‌‌‌‌‌‌‌సభ  ఎన్నికల్లో  రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ 414 స్థానాలు గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.  ఆ భారీ ప్రజాభిమానాన్ని అధికార ప్రదర్శనకు కాకుండా దేశాన్ని ఆధునికీకరించేందుకు వినియోగించాలనే లక్ష్యంతో  ఆధునిక ఆలోచనలకు ప్రాధాన్యతిస్తూ పాలన సాగించారు.

టెలికాం సాంకేతికత అభివృద్ధికి పునాదులు

 రాజీవ్ గాంధీ దూరదృష్టికి సాంకేతిక రంగమే అత్యంత స్పష్టమైన ఉదాహరణ. కంప్యూటర్లతో ఉద్యోగాలు పోతాయనే భయంతో అప్పట్లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ  భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో  కంప్యూటర్లు,  సమాచార సాంకేతిక కీలకమవుతాయని ముందుగా గుర్తించి  ప్రభుత్వ వ్యవస్థల్లో  కంప్యూటర్ల వినియోగాన్ని ఆయన ప్రోత్సహించారు. 1984లో  సీ-డాట్ ఏర్పాటుకు నాటి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత  దేశీయ టెలికాం సాంకేతికత అభివృద్ధికి బలమైన పునాదులు వేయడంతో  ఎస్టీడీ, పీసీవో వ్యవస్థల విస్తరణతో కమ్యూనికేషన్  సామాన్య ప్రజలకు సైతం చేరువైంది. 

 నాడు రాజీవ్ తీసుకున్న చర్యలతో నేడు భారత్ ఐటీ, డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, ఏఐ రంగాల్లో ప్రపంచంతో పోటీపడడమే కాకుండా, దేశంలో ఇప్పుడు ప్రతివారి చేతిలో మొబైల్, ప్రతి ఇంటిలో ఇంటర్నెట్, ప్రభుత్వ సేవల్లో డిజిటల్ విధానాలు సాధారణమయ్యాయి. కంప్యూటరీకరణ, టెలికాం విస్తరణ, సాంకేతికతకు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో రాజీవ్ గాంధీ వేసిన పునాదులు భారత సాంకేతిక ప్రయాణంలో కీలకంగా మారాయి.

దేశ నిర్మాణంలో యువత భాగస్వాములుగా...

యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములుగా చేయడంలో రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో కోట్లాది మంది యువతకు  ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వామ్యం లభించింది. అదే బాటలో  చట్టసభలకు పోటీచేసే వారి కనీస వయసును 21కి  తగ్గించాలని  తెలంగాణ కాంగ్రెస్ తరఫున నేను చేసిన ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తూ దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం.  

52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు పదో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను తీసుకురావడం కూడా ఆయన హయాంలోనే జరిగింది.    నేడు  మోదీ  ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓటు చోరీ,  సీటు చోరీ ఘటనలతో ఎన్నికల సంఘం విశ్వసనీయతపై  దేశంలో చర్చ జరుగుతోంది. 

లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆయన తండ్రి రాజీవ్ గాంధీ ఎన్నికల్లో చేపట్టిన సంస్కరణలను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న లోపాలను రుజువులతో నిరూపిస్తూ ఎన్నికల్లో పారదర్శకత, ఓటర్ల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఎన్నికల్లో సంస్కరణల కోసం విశేష కృషి చేసిన రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శకంలో నడుస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ‘సర్‌‌‌‌‌‌‌‌’ ప్రక్రియలో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోకుండా వారికి అండగా నిలబడుతోంది.

పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు

గ్రామ స్వరాజ్యం, అధికార వికేంద్రీకరణకు రాజీవ్ గాంధీ ముందుచూపుతో ఆలోచించారు. పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించేందుకు ఆయన ప్రభుత్వం 64వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ చారిత్రాత్మక నిర్ణయం 1992లో  పీవీ నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు పునాదిగా నిలిచింది. నాటినుంచి  పంచాయతీలు గ్రామాలభివృద్ధి నిధులను నేరుగా పొందుతుండడంతో వాటికి ఆర్థిక స్వావలంబన చేకూరింది. 

అంతేకాక మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పెరగడానికి ఈ రాజ్యాంగ వ్యవస్థ కీలకమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లు ఆమోదించడం బడుగు బలహీన, మైనార్టీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును అడ్డుకోవడం దురదృష్టకరం. 

భారతరత్న రాజీవ్‌‌‌‌‌‌‌‌గాంధీ

రాజీవ్ గాంధీ  మానవీయతతో వ్యవహరిస్తూ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌పేయితో రాజకీయ విభేదాలున్నా వ్యక్తిగతంగా గౌరవిస్తూ ఆయన శస్త్రచికిత్స కోసం సహకరించారు.    డిజిటల్ ఇండియా, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష రంగం, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, టెలికాం విస్తరణ వంటి రంగాల్లో దేశం ముందుకు సాగుతోంది. అదే సమయంలో ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయత, సామాజిక న్యాయం, యువతకు ఉపాధి, రాజకీయాల్లో విలువలు వంటి సవాళ్లు మనముందున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజీవ్ ఆలోచనలను కేవలం కాంగ్రెస్  రాజకీయాలుగా కాకుండా,  భవిష్యత్ భారత నిర్మాణానికి  సంబంధించిన విలువైన పాఠాలుగా చూడాల్సిన అవసరం ఉంది.

 తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎల్టీటీఈ  ఆత్మాహుతి దాడిలో 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం  దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. కేవలం 46 ఏళ్లకే  ఆయన జీవితం ముగిసినా, ఆయన ఆలోచనలు మాత్రం ఆదర్శనీయం. మరణానంతరం రాజీవ్ గాంధీకి భారతరత్న ప్రదానం ఆయన సేవలకు దేశం అందించిన గౌరవం.   ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనను  స్మరించుకోవడం మన బాధ్యత.  ఆదర్శ విలువలతో  భవిష్యత్ భారత్‌‌‌‌‌‌‌‌కు బాటలు వేసిన రాజీవ్ గాంధీ అన్ని తరాలకు మార్గదర్శిగా నిలుస్తారు.

 బి.మహేశ్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.