స్టైఫండ్ వివక్షత: అల్లోపతికి రూ.60 వేలు.. ఆయుష్కు రూ.30 వేలా?

స్టైఫండ్ వివక్షత: అల్లోపతికి రూ.60 వేలు.. ఆయుష్కు రూ.30 వేలా?

హైదరాబాద్, వెలుగు: ప్రజారోగ్యం కోసం శ్రమించే ఆయుష్ (ఆయుర్వేద, యునాని, హోమియోపతి) వైద్య విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లోపతి వైద్యులతో సమానంగా వీరికి కూడా స్టైఫండ్, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆయుర్వేద కాలేజీలో 16 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు బుధవారం మద్దతు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ఆయుష్ వైద్యులకు గౌరవప్రదమైన స్టైఫండ్ ఇస్తోందని తెలిపారు. పీజీ విద్యార్థులకు రూ.60 వేలు, హౌస్ సర్జన్లకు రూ. 25 వేలు ఇస్తున్నారనీ, కానీ తెలంగాణలో పీజీలకు రూ.30 వేలు, హౌస్ సర్జన్లకు రూ.13 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. 

2006 జీవో ప్రకారం అల్లోపతి, ఆయుష్ విద్యార్థులను సమానంగా చూడాలని ఉన్నా.. 2016 నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దీన్ని తుంగలో తొక్కాయని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయుష్ వైద్యుల కోసం అసెంబ్లీలో గొంతు చించుకున్న నేటి ఉప ముఖ్యమంత్రి , ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.