ఏమైనా ఘనకార్యం చేస్తే వాట్సాస్ స్టేటస్ పెట్టుకుంటాం.. మంచి అయినా చెడు అయినా నలుగురి తెలియాలి తెలుస్తుందని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవటం కామన్. మరికొందరు తమ ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ ఉంటారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకి చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి పెట్టిన వాట్సాప్ స్టేటస్ మాత్రం ఇప్పటి వరకు ఎవరూ పెట్టి ఉండరు.. అసలు ఇలాంటి స్టేటస్ పెట్టాలన్న ఆలోచన రాదు.. ఇంత ఘన కార్యం ఆయన ఏం చేశాడు అని తెలిస్తే.. మీరు కచ్చితంగా అంటారు అరే ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావ్.. ఇంత వయలెంట్‌గా ఉన్నావ్ అని కామెంట్ చేయకుండా ఉండలేరు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భయానక ఘటన వెలుగు చూసింది. వాట్సప్‌లో స్టేటస్ పెట్టి మరీ భార్య, సోదరిని అత్యంత దారుణంగా హత్య చేసి చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ బ్యాంక్ ఎంప్లాయ్. పోలీసుల వివరాల ప్రకారం.. లక్నోలో నివాసం ఉంటున్న మానస్ బాజ్‌పేయి, దివ్యా మిశ్రా భార్యభర్తలు. ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయ్స్. మానస్ ఎస్బీఐలో ఉద్యోగం చేస్తుండగా.. దివ్యా ఐసీఐసీఐ బ్యాంకులో జాబ్ చేస్తుంది. ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అప్పటికే భార్యపై తీవ్ర కోపంతో ఉన్న మానస్ బాజ్‌పేయి దారుణానికి ఒడిగట్టాడు. గురువారం (ఆగస్ట్ 20) భార్య పని చేసే బ్యాంక్ దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటూ ఆమెను బయటకు పిలిచాడు. భార్య బయటకు రాగానే తన దగ్గర ఉన్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
అనంతరం అక్కడి నుంచి పారిపోయిన మానస్ బాజ్‌పేయి ఈ భయంకరమైన విషయాన్ని వాట్సప్‌లో స్టేటస్ పెట్టాడు. ‘‘ఈరోజు నేను నా భార్యను చంపాను.. ఎందుకంటే ఆమె నన్ను మోసం చేసింది. ఇప్పుడు నా సోదరిని హత్య చేసి తర్వాత నేను కూడా చనిపోతా’’ అంటూ వాట్సప్‌లో స్టేటస్ పెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. చెప్పిటనట్లుగానే భార్యను చంపిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లి మానసిక సమస్యలతో బాధపడుతోన్న తన సోదరిని చంపేశాడు.
ఆ తర్వాత మానస్ కూడా తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. అతడి వాట్సాప్ స్టేటస్ చూసి స్థానికులు ఇంటికి వెళ్లి చూడగా.. మానస్, అతడి సోదరి రక్తపు మడుగులో శవాలై పడి ఉన్నారు. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడి ఇల్లు నుంచి మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
లక్నోలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మానస్, దివ్యా వివాహం జరిగి 12 ఏళ్లు కాగా.. గత ఏడాది కాలంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. కోర్టులో వీరికి విడాకుల కేసు నడుస్తోంది. ఈ క్రమంలోనే భార్య తనను మోసం చేసిందనే కోపంతో మానస్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
