ఏపీ, తెలంగాణ కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ వెళ్లే రూట్స్ డిసైడ్ చేసేది కేంద్రమే

ఏపీ, తెలంగాణ కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ వెళ్లే రూట్స్ డిసైడ్ చేసేది కేంద్రమే

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రయాణించే మార్గాలపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. గురువారం (ఆగస్ట్ 20) దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‎తో భేటీ పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో బులెట్ ట్రైన్స్ ఏ మార్గంలో వెళ్లాలనేది దక్షిణ మధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేయదని క్లారిటీ ఇచ్చారు. 

బుల్లెట్ ట్రైన్లు ప్రయాణించే మార్గాలను కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ రైల్వే నిర్ణయిస్తుందని వివరణ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో బుల్లెట్ ట్రైన్ మార్గాలపై జరుగుతున్న ప్రచారంపై కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ భూసేకరణ, అలైన్మెంట్ కేంద్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన మార్గంలోనే బుల్లెట్ ట్రైన్ పనులు సాగుతాయని పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఉందని.. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ లైన్ల డీపీఆర్ త్వరలోనే వస్తుందని చెప్పారు.

ALSO READ : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: క్యూలో నిలబడే పనే లేదు.. 

39 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి సాగుతున్నదని.. డబ్లింగ్ పనులు మరింత తొందరగా చేయాలని రైల్వే అధికారులను విజ్ఞప్తి చేశామని తెలిపారు. హైదరాబాద్‎కు తూర్పు వైపు ప్రధాని మోడీ చర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి చేశారని.. అలాగే హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఈదుల నాగులపల్లిలో కూడా టెర్మినల్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశామని చెప్పారు. కాజీపేట డివిజన్ కూడా ఏర్పాటు చేయాలని అన్ని పార్టీల ఎంపీలం విజ్ఞప్తి చేశామని తెలిపారు. పఠాన్ చెరు, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరించాలని కోరామన్నారు. అలాగే, ట్రైన్లలో జర్నలిస్టు పాసులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశామన్నారు.