హైదరాబాద్ లో మరో కల్తీ బాగోతం వెలుగులోకి వచ్చింది. గురువారం ( ఆగస్టు 20 ) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో ఎస్ఓటీ టీం జరిపిన తనిఖీల్లో భారీగా కల్తీ మసాలాలు పట్టుబడ్డాయి. ఎస్ ఓ టి మల్కాజిగిరి, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీం సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో సుమారు రూ.25 లక్షల విలువైన కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మేడిపల్లిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌లో అపరిశుభ్ర వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారం పొడిలో ఏకంగా 30 శాతం రంపపు పొట్టు కలుపుతున్నట్లు బయటపడిందని తెలిపారు అధికారులు.
అంతేకాకుండా, ప్రముఖ బ్రాండ్‌ను పోలి ఉండేలా "SwaSwastik Dish" పేరుతో డూప్లికేట్ లేబుల్స్, ప్యాకింగ్‌తో ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.దాడిలో 2వేల 300 కిలోల పసుపు, 3వేల 350 కిలోల కారం, 5వేల 140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలా స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో సత్యనారాయణ, రుద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యల కోసం మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. దాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.కల్తీ ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్యాకెట్‌పై బ్రాండ్ పేరు, తయారీ-గడువు తేదీలు, బ్యాచ్ నంబర్, FSSAI వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు.
