కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరించింది. 2014 నుంచి అమలవుతున్న ఈ పథకాల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాధనాన్ని ఇలా ఉచిత పథకాలకు మళ్లించడంతో జీతాలు, పెన్షన్లు రాక అనేక మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అవస్థలు పడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. భూసేకరణ బాధితులకు చెల్లించాల్సిన పరిహారాలను పక్కనపెట్టి ఉచిత పథకాలకు నిధులు ఎలా కేటాయిస్తారని కోర్టు ప్రశ్నించింది.

 ప్రజలు కట్టే పన్నులు ఉచిత పథకాలకు వాడటం న్యాయమేనా అని ప్రశ్నించింది. ఇలాంటి ఉచిత పథకాల వల్ల రాష్ట్రంలో ఆర్థిక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాధనాన్ని ఇలా మళ్లించే బదులు, భూ బాధితలకు సకాలంలో పరిహారం చెల్లించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రజలకు అసలు ఇటువంటి పథకాల అవసరమే ఉండదని సూచించింది. 

ఉచిత పథకాల అమలుపై లాయర్ విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చట్టసభల్లో తీర్మానం లేకుండా అమలు చేస్తున్న కల్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఉచిత పథకాలు చెల్లవని పిటిషన్‎లో పేర్కొన్నారు. ఆగస్టు12న ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్ కుమార్.. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ పథకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని.. ఈ పథకాల కింద ఎలాంటి చెల్లింపులు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ఇదే కేసు విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారి చేసినప్పటికీ నాలుగు వారాలైన ప్రభుత్వం స్పందించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలపై స్టే ఎత్తివేయాలని కోరింది. ఇందుకు అంగీకరించని హైకోర్టు.. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలపై స్టేను పొడగించింది. అనంతరం కేసు తదుపరి విచారణను 2026, ఆగస్ట్ 24కు వాయిదా వేసింది.

ALSO READ : ఏపీ, తెలంగాణ కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ వెళ్లే రూట్స్ డిసైడ్ చేసేది కేంద్రమే