తెలుగు ఇళ్లలో ఎక్కువగా చేసుకునే వంటల్లో చారు, సాంబారుతోపాటు రసం కూడా ఒకటి. లంచ్, డిన్నర్.. ఇలా ఏ టైంలోనైనా, అన్నం, రసం కాంబినేషన్లో తింటే సంతృప్తిగా ఉంటుంది. అయితే రసం అంటే ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా, కొత్తగా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అందుకే ఇంట్లో సింపుల్ గా కళ్యాణ రసం.. పొదీనా రసం తింటే వర్షాకాలంలో వచ్చే జలుబు.. దగ్గు మీ దగ్గరికి రావాలంటే భయపడుతాయి.. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పుదీనా రసం తయారీకి కావాల్సినవి
- కందిపప్పు: ఒక కప్పు
- కొత్తిమీర తరుగు: అరకప్పు
- నెయ్యి : ఒక టీస్పూన్
- ఆవాలు: ఒక టీస్పూన్
- వెల్లుల్లి తరుగు ఒక టీస్పూన్
- ఉప్పు: తగినంత
- పసుపు: అర టీ స్పూన్
- టొమాటో ముక్కలు: ఒక కప్పు
- చింతపండు: యాభై గ్రాములు
- పుదీనా ఆకులు: పావు కప్పు
- కొబ్బరి తురుము: రెండు టేబుల్ స్పూన్స్
- కరివేపాకు: పది రెమ్మలు
- జీలకర్ర: ఒక టీస్పూన్
- కొత్తిమీర : ఒక కట్ట
- ఎండుమిర్చి- రెండు
- మిరియాలు: ఒకటీ స్పూన్
పుదీనా రసం తయారీ విధానం
కందిపప్పు మెత్తగా ఉడికించాలి. పుదీనా ఆకులు, కొబ్బరి తురుము, మిరియాల పొడి కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర తరుగు వేసి సన్నని మంట మీద వేగించి, పొడి చేయాలి.
ఒక స్టవ్ పై మూకుడు పెట్టి, రెండు కప్పుల నీళ్లు పోసి, టొమాటో ముక్కలు, పసుపు, చింతపండు రసం ఉప్పు వేసి ఉడికించాలి. ఇందులోనే ఉడికించుకున్న కందిపప్పు చేసి మరికొద్ది సేపు ఉడికించాలి. దీనిలో పొడి చేసి పెట్టుకున్న మిశ్రమం వేయాలి .
ఒక పొంగు వచ్చే వరకు ఉడికిస్తే చాలు. నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, దంచిన వెల్లుల్లి వేసి తాలింపు పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పప్పులో వేస్తే చా చివర్లో కొద్దిగా కొత్తిమీద తరుగు వేస్తే పుదీనా రసం రెడీ.
దీనిని అన్నంలో కలుపుకొని తింటే వర్షాకాలంలో వచ్చే జలుబు.. దగ్గు మీ దగ్గరికి రావాలంటే భయపడుతాయి.
కల్యాణ రసం తయారీకి కావాల్సినవి
- కందిపప్పు: ముప్పావు కప్పు
- చింతపండు: వంద గ్రాములు
- మిరియాలు :ఒక టీ స్పూన్
- వెల్లుల్లి: ఎనిమిది
- జీలకర్ర: ఒక టీ స్పూన్
- టొమాటో: ఒకటి (మీడియం సైజ్)
- ఉప్పు తగినంత
- పసుపు: పావు టీ స్పూన్
- నూనె: రెండు టేబుల్ స్పూన్స్
- ఎండుమిర్చి: నాలుగు
- ఆవాలు: ఒక టీస్పూన్
- కరివేపాకు: మూడు రెబ్బలు కాడలతో సహా
- కొత్తిమీర: ఒక కట్ట
- ఇంగువ: చిటికెడు
- నీళ్లు: తగినన్ని
కళ్యాణ రసం తయారీ విధానం
కందిపప్పును మెత్తగా ఉడికించి పక్కన పెట్టాలి. జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిని కలిపి మెత్తగా దంచుకోవాలి చింతపండులో రెండు, మూడు కప్పుల నీళ్లు పోసి రసం తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, పసుపు వేసి వేగించుకోవాలి .
తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు లోప్లేమ్ మీద ఉడికించాలి. టొమాటో ముక్కలు మెత్తగా అయ్యాక, ఉడికించిన కందిపప్పు తగినంత ఉప్పు, నీళ్లు పోసి బాగా కలిపి మరి కొంచెంసేపు ఉడికించుకోవాలి.
తర్వాత చింతపండు రసం పోసి దంచుకున్న మిరియాలు- వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసి కొద్ది సేపు ఉడికించి ఒక పొంగులాగానే ఇంగువ వేసి కలిపి దించేస్తే కళ్యాణ రసం రడీ. దీనిని వేడి వేడి అన్నంలో మెత్తగా కలుపుకొని తింటే చాలు.. ఆరోగ్యానికి .. ఆరోగ్యం రుచికి రుచి ఉంటుంది.
