విశాఖపట్టణంలో జరిగిన ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలి నిర్వాకానికి ఓ ఆరేళ్ల పసిప్రాణం బలైపోయింది. హోంవర్క్ చేయలేదన్న నెపంతో ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా కొట్టడంతో యూకేజీ చదువుతున్న ప్రణయ్ తేజ్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక ఘటన వన్ టౌన్ పరిధిలోని 'లిటిల్ గార్డెన్ స్కూల్' లో చోటుచేసుకుంది. పాఠశాలలోనే కుప్పకూలిన చిన్నారి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బాలుడు ప్రణయ్ తేజ్ రోజూ లాగే పాఠశాలకు వెళ్లాడు.
--> విశాఖలో దారుణం.. బాలుడిని భయపెట్టి చంపిన స్కూల్ టీచర్
— Journalist Nikhil (@Nikhil_Journo) August 20, 2026
--> విశాఖ లిటిల్ గార్డెన్ స్కూల్లో షాకింగ్ ఘటన
--> ప్రణయ్ తేజ అనే బాలుడిని భయపెడుతూ కొట్టిన స్కూల్ టీచర్
--> టెన్షన్ తో ఆగిన చిన్నారి గుండె.. కేజీహెచ్ వద్ద బంధువుల ఆందోళన#Vizag #School #ViralVideo pic.twitter.com/ek3QJZnrG3
అయితే, హోంవర్క్ పూర్తి చేయలేదనే కారణంతో సదరు క్లాస్ టీచర్ బాలుడిపై తీవ్రంగా చేయి చేసుకుంది. టీచర్ కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి పాఠశాల తరగతి గదిలోనే ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. దీంతో భయాందోళనకు గురైన పాఠశాల సిబ్బంది, బాలుడిని చికిత్స నిమిత్తం అత్యవసరంగా కింగ్ జార్జ్ హాస్పిటల్(KGH) కు తరలించారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే బాలుడి పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు.
వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలు-బంధువుల ఆరోపణలు
ఈ ఘటనకు సంబంధించి పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియా, మీడియా మాధ్యమాల్లో వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫుటేజ్‌లో సదరు ఉపాధ్యాయురాలు కేవలం ప్రణయ్ తేజ్‌నే కాకుండా, క్లాస్‌లోని మరికొంత మంది విద్యార్థులను కూడా తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు ఉన్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుల క్రూర ప్రవర్తనకు ఈ దృశ్యాలే నిదర్శనమని వారు మండిపడుతున్నారు.
KGH వద్ద ఉద్రిక్తత.. న్యాయం కోసం డిమాండ్:
బాలుడి మరణవార్త తెలియడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు, బంధువులు కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) కు భారీగా చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యం, బాధ్యురాలైన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద తీవ్ర ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాధితులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మృతికి గల అసలు కారణాలు సీసీటీవీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అలాగే వైద్యుల నివేదిక మరియు పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగానే అధికారికంగా స్పష్టత రానుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై కఠిన పర్యవేక్షణ ఉండాలని, పిల్లలపై శారీరక దాడులకు పాల్పడే ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
