హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ మేరకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవికి గురువారం (ఆగస్ట్ 20) ఆమె వివరణాత్మక లేఖ పంపారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నారు.
తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్‌పై సుస్మిత హాట్ కామెంట్స్
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత బుధవారం (ఆగస్ట్ 19) వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఇతర నేతల మీద తీవ్ర ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి సీఎం అయ్యాక కళ్లు నెత్తికెక్కాయని.. రేవంత్ కుటుంబ సభ్యులు వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని నిరాధార ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే టికెట్ రేవంత్ రెడ్డి ఇప్పుడే ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాను బరిలోకిద దిగుతానని.. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని ప్రకటించారు.
రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో ఎవరికీ తెలియదని విమర్శించారు. స్వయంగా మంత్రి కుమార్తె సీఎంపై, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌తో పాటు స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా సీరియస్ అయ్యింది. సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండ సురేఖను బాధ్యురాలిగా చేస్తూ కూతురి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ సురేఖకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
