బాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్, మేనరిజమ్స్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన నటుడు రాజ్‌పాల్ యాదవ్ (Rajpal Yadav). ‘చుప్ చుప్ కే’, ‘హంగామా’ వంటి చిత్రాలతో కామెడీ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తాజాగా తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన వివాదాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజ్‌పాల్ యాదవ్.. తన 26 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఆర్థిక సమస్యలు, చట్టపరమైన ఇబ్బందులు తనను ఎప్పుడూ నిర్వచించలేవని స్పష్టం చేశారు. ముఖ్యంగా తనను డబ్బుతో ఎవరూ కొనలేరని అన్నారు. 2013 నుంచి 2026 మధ్య కాలంలో తనకు ఏకంగా రూ.200-250 కోట్ల వరకు వ్యక్తిగత నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. చెక్ బౌన్స్ కేసు కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.
13 ఏళ్లలో రూ.250 కోట్ల నష్టం..
రాజ్‌పాల్ యాదవ్ మాట్లాడుతూ..‘‘2013 నుంచి 2016 వరకు నాకు రూ.200-250 కోట్ల వ్యక్తిగత నష్టం జరిగింది. ఈ విషయాన్ని నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. కనీసం 50 విదేశీ టూర్లను కోల్పోయాను. నాకు రావాల్సిన పారితోషికం కూడా భారీగా తగ్గిపోయింది. ఉదాహరణకు రూ.100 రావాల్సిన చోట రూ.10 మాత్రమే వచ్చేది’’ అని చెప్పారు. ఈ క్రమంలోనే తాను డబ్బు కోసం కళను వదులుకోలేదని రాజ్‌పాల్ యాదవ్ స్పష్టం చేశారు. ‘‘నేను చిన్నప్పటి నుంచే కళను నమ్ముకున్నాను. నా నటనలో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తాను. డబ్బు నా వెంట పరుగెత్తుకుంటూ వస్తుంది’’ అని అన్నారు.
Rajpal Yadav Is ‘Mangta No. 1': Actor's Candid Conversation Amid Financial Issues pic.twitter.com/QPZZCqeKhN
— NDTV (@ndtv) August 19, 2026
తీసుకున్న డబ్బులు తప్పకుండా చెల్లిస్తా.. ఒకవేళ?
తన అప్పుల గురించి కూడా ఆయన స్పందించారు. ‘‘నేను ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నానో.. దాన్ని చెల్లించాను లేదా చెల్లిస్తాను. 200 మంది దగ్గర అప్పు తీసుకున్నా.. వారికి చెల్లించాల్సిన డబ్బును తప్పకుండా చెల్లిస్తాను. ఒకవేళ నేను చెల్లించకపోతే ఆ డబ్బు వారి ఇంటికే చేరుతుంది’’ అని తెలిపారు. అంతేకాదు.. ‘‘రూ.5 కోట్లతో కానీ, రూ.250 కోట్లతో కానీ నన్ను ఎవరూ కొనలేరు. ముఖ్యంగా డబ్బుతో నన్ను కొనలేరు’’ అంటూ రాజ్‌పాల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆర్థిక ఇబ్బందులు తన కెరీర్‌ను, నటుడిగా తన ఉనికిని నిర్వచించలేవని అన్నారు.
ఆర్థిక ఇబ్బందులు తన కెరీర్‌ను, సినిమాపై తనకున్న అంకితభావాన్ని ఎప్పటికీ మార్చలేదని నటుడు రాజ్‌పాల్ యాదవ్ తెలిపారు. తాను ఇప్పటికీ భారతీయ సినిమాకు ఓ విద్యార్థినేనని, నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పారు. డబ్బు కోసం కాకుండా కళ కోసం జీవిస్తున్నానని, కష్టకాలంలోనూ విజయాల సమయంలోనూ ప్రేక్షకులు తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ‘‘నేను ఎప్పుడూ కనుమరుగైపోలేదు. ఇప్పటికీ ఎయిర్‌పోర్టుల్లో దాదాపు 500 మంది నాతో సెల్ఫీలు తీసుకుంటారు. నేను ఎప్పుడూ ఓడిపోలేదు.. ఈ విషయాన్ని ప్రపంచానికి నిరూపిస్తాను’’ అని రాజ్‌పాల్ యాదవ్ వెల్లడించారు.
న్యాయపరమైన వివాదం..
ఇదిలా ఉంటే.. ముర్లీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో రాజ్‌పాల్ యాదవ్, ఆయన భార్యకు సంబంధించిన శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని నిర్ణీత హామీల మేరకు చెల్లించడంలో ఆయన విఫలమైనట్లు కేసు వివరాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలులో లొంగిపోయిన సమయంలో తన వద్ద డబ్బు లేదని చెప్పిన నేపథ్యంలో.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ సహా పలువురు నటులు ఆయనకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ వివాదం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని సమాచారం.
స్పెషల్ ప్రాజెక్ట్‌పై దృష్టి..
తన భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా రాజ్‌పాల్ యాదవ్ ఆసక్తికర విషయాలు తెలిపారు. 2000 నుంచి 2026 వరకు భారతీయ సినిమాకు తాను అందించిన 26 ఏళ్ల ప్రయాణాన్ని ఒక స్పెషల్ ప్రాజెక్ట్‌గా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. తన సినీ అనుభవాలు, ప్రయాణం, కళ పట్ల తనకున్న అనుబంధాన్ని ఈ ప్రాజెక్ట్‌లో చూపించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. రాజ్‌పాల్ యాదవ్ చివరిసారిగా ‘వెల్కమ్ టు ది జంగిల్’ చిత్రంలో కనిపించారు. 26 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, సవాళ్లు ఎదురైనా.. తనకు డబ్బు కంటే కళ, ప్రేక్షకుల ఆదరణే ముఖ్యమని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
సినిమాలు..
నటుడు రాజ్‌పాల్ యాదవ్.. హిందీతో పాటుగా మరాఠీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, తెలుగు భాషల్లో నటించారు. బాలీవుడ్ లో ‘భూల్ భూలయ్య’, ‘డ్రీమ్ గర్ల్ 2’, ‘బేబీజాన్’, ‘హంగామా’, భూత్ బంగ్లా వంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటించి గుర్తింపు పొందారు. తెలుగులో రవితేజ నటించిన ‘కిక్ 2’తో ఎంట్రీ ఇచ్చారు.
