Vijay Ajith: విజయ్–అజిత్ రీయూనియన్.. ఒకరికొకరు ఇచ్చుకున్న గిఫ్ట్స్ వైరల్!

Vijay Ajith: విజయ్–అజిత్ రీయూనియన్.. ఒకరికొకరు ఇచ్చుకున్న గిఫ్ట్స్ వైరల్!

తమిళ సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆసక్తి రేపే కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది విజయ్–అజిత్‌దే. తెరపై ఇద్దరూ ప్రత్యర్థి హీరోలుగా కనిపించకపోయినా.. అభిమానుల మధ్య మాత్రం ఎన్నో ఏళ్లుగా పోటీ కొనసాగుతోంది. అలాంటి ఇద్దరు స్టార్లు ఒకే చోట కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకోవడం అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమే. తాజాగా వీరిద్దరి కలయికకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంగ్లాండ్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో జరిగిన రేసింగ్ ఈవెంట్‌లో సీఎం విజయ్, అజిత్ కుమార్ కలుసుకున్నారు. అజిత్ రేసింగ్‌పై ఉన్న ఆసక్తితో ఈ పోటీలో పాల్గొనగా.. ఆయనను కలిసేందుకు వచ్చిన విజయ్ ఎంతో ఉత్సాహంగా వెళ్లి ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఇద్దరు హీరోలు కలిసి ఉన్న ఈ విజువల్స్ అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

అజిత్‌కు విజయ్ స్పెషల్ గిఫ్ట్.. 

తాజాగా ఈ సమావేశానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అజిత్‌కు విజయ్ ఓ మినియేచర్ రేసింగ్ కారును బహుమతిగా ఇచ్చారు. సాధారణ గిఫ్ట్‌లా కాకుండా.. అజిత్ రేసింగ్ ప్యాషన్‌ను గుర్తు చేసేలా ఈ కానుకను అందించడం విశేషం.

ఈ చిన్న రేసింగ్ కారుపై విజయ్ స్వయంగా ఓ ప్రత్యేక సందేశాన్ని రాసి సంతకం చేశారు. అజిత్‌ను తన ‘నా ప్రియమైన సోదరుడు అజిత్‌కు ప్రేమతో..’ అని విజయ్‌ తన ఆటోగ్రాఫ్‌తో గిఫ్ట్‌ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ కానుకకు మరింత ప్రత్యేకత వచ్చింది. విజయ్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను చూసి అజిత్ కూడా సంతోషించినట్లు తెలుస్తోంది.

విజయ్‌కు అజిత్ రిటర్న్ గిఫ్ట్

సీఎం విజయ్ తనకు రేసింగ్ కారు బహుమతిగా ఇవ్వడంతో అజిత్ కూడా ఆయనకు ఓ ప్రత్యేక కానుక అందించారు. తాను రేసింగ్‌లో ఉపయోగించే హెల్మెట్‌పై ‘లవ్ అజిత్’ అని రాసి విజయ్‌కు ఇచ్చారు. దీంతో ఒకరిపై మరొకరికి ఉన్న అభిమానం, గౌరవం మరోసారి స్పష్టమైంది. ఈ గిఫ్ట్ ఎక్స్చేంజ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో ఇద్దరు హీరోల అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. గతంలో వీరి అభిమానుల మధ్య కనిపించిన పోటీకి భిన్నంగా.. ఇద్దరు స్టార్లు ఇలా స్నేహపూర్వకంగా కలుసుకోవడం ఫ్యాన్స్‌కు నచ్చుతోంది.

ఫ్యాన్ వార్‌కు ఫుల్‌స్టాప్ పడినట్టేనా?

విజయ్‌ను దళపతి అని, అజిత్‌ను తలా అని అభిమానులు పిలుచుకుంటారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇద్దరి అభిమానుల మధ్య పోటీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఇద్దరి సినిమాలు ఒకే సమయంలో విడుదలైన సందర్భాల్లో ఈ పోటీ మరింత తీవ్రంగా కనిపించేది. సోషల్ మీడియాలోనూ రెండు వర్గాల అభిమానుల మధ్య మాటల యుద్ధాలు జరిగేవి.

అయితే ఇప్పుడు విజయ్, అజిత్ వ్యక్తిగతంగా ఇంత సన్నిహితంగా కలుసుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. సిల్వర్‌స్టోన్‌లో అజిత్‌ను కలిసిన సమయంలో విజయ్ అభిమానులు ఆయనకు రాజకీయ నినాదాలతో స్వాగతం పలికారు. అయితే విజయ్ మాత్రం ఆ నినాదాలను ఆపి.. రేసింగ్ ట్రాక్‌లో ఉన్న అజిత్‌కు గట్టిగా మద్దతు ఇవ్వాలని అభిమానులను కోరినట్లు సమాచారం. ఈ సందర్భం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయ్ తో త్రిష..

ఈ రేసింగ్ ఈవెంట్‌కు హీరోయిన్ త్రిష కృష్ణన్, టీవీకే నేత ఆధవ్ అర్జున తదితరులు కూడా హాజరయ్యారు. రేస్ ప్రారంభానికి ముందు అజిత్ రేసింగ్ టెంట్‌లో విజయ్, త్రిష కలిసి కొంతసేపు గడిపారు. అనంతరం విజయ్ గ్రీన్ ఫ్లాగ్ ఊపి రేస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత వీరంతా కలిసి బాల్కనీ నుంచి రేసింగ్ పోటీలను వీక్షించారు. ఈ పోటీలో మొత్తం 44 మంది రేసర్లు పాల్గొన్నట్లు సమాచారం. అజిత్ కుమార్ ఓవరాల్‌గా 38వ స్థానంలో నిలిచారు. సినిమాలతో పాటు మోటార్ రేసింగ్‌పై ఉన్న తన ఆసక్తిని అజిత్ ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నారు.

రాజకీయాల్లో విజయ్.. సినిమాల్లో అజిత్

విజయ్ ప్రస్తుతం తన రాజకీయ ప్రయాణంపై దృష్టి పెట్టారు. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. నటుడిగా ఆయన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా జులై 23, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరోవైపు అజిత్ సినిమాలతో పాటు రేసింగ్‌ను కూడా కొనసాగిస్తున్నారు. ఇటీవల ‘విదాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రస్తుతం ‘డేర్ డెవిల్’ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. మొత్తానికి.. ఒకప్పుడు అభిమానుల పోటీతో వార్తల్లో నిలిచిన విజయ్, అజిత్ ఇప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా అజిత్‌కు విజయ్ ఇచ్చిన రేసింగ్ కారు, దానిపై రాసిన ప్రత్యేక సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.