ప్రముఖ టెలివిజన్ హోస్ట్, నటి మిని మాథుర్ (Mini Mathur) అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ‘ఇండియన్ ఐడల్ సీజన్’ షోకు ఆమె అందించిన హోస్టింగ్ ఒక ప్రత్యేక ముద్ర వేసింది. అయితే, తాను రెండోసారి ప్రెగ్నెన్సీ అయిన సమయంలో ఇదే షో నుంచి తనను తప్పించారని మిని మాథుర్ తాజాగా వెల్లడించిన విషయం చర్చనీయాంశంగా మారింది.
ప్రెగ్నెన్సీ అని చెబితే.. షో నుంచి తప్పించారు: మిని మాథుర్
మిని మాథుర్ తన రెండో సంతానం సైరాకు ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. తాను ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని షో నిర్వాహకులకు చెప్పినప్పుడు వారు తనను కొనసాగించేందుకు నిరాకరించారని ఆమె వెల్లడించారు.
“ఆడిషన్స్ వరకు బాగానే ఉంటుంది. కానీ ఫినాలే సమయానికి నీకు బేబీ బంప్ కనిపిస్తుంది. గర్భిణీ అయిన హోస్ట్‌ను భారతీయ ప్రేక్షకులు అంగీకరించరు” అని నిర్వాహకులు తనతో చెప్పినట్లు మిని మాథుర్ గుర్తుచేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె తెలిపారు. అప్పట్లో టెలివిజన్ రంగంలో మహిళల పట్ల ఉన్న ఆలోచనా విధానం తనకు ఎంతో నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.
మళ్లీ అవకాశం వచ్చినా.. తిరస్కరించిన మిని
ఆ ఘటన తర్వాత మిని మాథుర్ మనసు తీవ్రంగా కలత చెందిందట. ప్రపంచం మారుతున్నప్పటికీ, టెలివిజన్ రంగంలో ఇలాంటి సంకుచిత ఆలోచనలు ఉండటం తనను నిరాశపరిచిందని ఆమె చెప్పారు. తర్వాత ‘ఇండియన్ ఐడల్ సీజన్ 6’ కోసం మళ్లీ తనను సంప్రదించినప్పటికీ, అప్పటికే తన మనసు ఆ షో నుంచి పూర్తిగా దూరమైందని తెలిపారు. దీంతో ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు.
టీవీ నుంచి ఓటీటీ వరకు..
మిని మాథుర్ తన కెరీర్‌ను ‘తోల్ మోల్ కే బోల్’ అనే కార్యక్రమంతో ప్రారంభించారు. ఆ తర్వాత MTV VJగా యువతకు చేరువయ్యారు. ‘ఇండియన్ ఐడల్’ హోస్ట్‌గా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. నటిగానూ తన సత్తా చాటిన ఆమె ‘మైండ్ ది మల్హోత్రాస్’ వెబ్ సిరీస్‌లో నటించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ రియాలిటీ షో ‘అలైయన్స్’ (Alliance) లో విజేతగా నిలిచారు.
కబీర్ ఖాన్‌తో 28 ఏళ్ల అనుబంధం..
ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్తో మిని మాథుర్‌కు దాదాపు 28 ఏళ్ల అనుబంధం ఉంది. ఒక హోమ్ టీవీ షో కోసం జరిగిన ప్రయాణంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో కబీర్ ఖాన్ ఫ్రీలాన్స్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు.
ALSO READ : Varanasi: మహేష్ బాబు 'వారణాసి'లో మ్యూజిక్ మ్యాజిక్..
ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి చివరకు వివాహానికి దారితీసింది. ఇద్దరూ ఒకే సినీ రంగానికి చెందినవారే అయినప్పటికీ, వృత్తిపరంగా కలిసి పనిచేయకూడదనే నిర్ణయం తీసుకున్నారని మిని గతంలో వెల్లడించారు. అదే తమ వ్యక్తిగత బంధాన్ని బలంగా ఉంచడానికి ఒక కారణమని ఆమె తెలిపారు.
మొత్తానికి, ప్రెగ్నెన్సీ కారణంగా కెరీర్‌లో ఎదురైన వివక్షపై మిని మాథుర్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. అయినప్పటికీ, ఆమె తన పట్టుదలతో టెలివిజన్, సినిమా, ఓటీటీ రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
